Fund Review: స్థిరత్వంతో కూడిన రాబడులు.. మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌

Mirae asset large cap fund Review - Sakshi

అంతర్జాతీయంగా, దేశీయంగా లిక్విడిటీ (నిధులు) మద్దతుతో ఈక్విటీ మార్కెట్లు గత ఏడాదిన్నర కాలంలో గణనీయంగా ర్యాలీ చేశాయి. ఈ పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు అస్థిరతలు తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇవి స్థిరమైనవే కాకుండా, మార్కెట్లు కుదుటపడిన వెంటనే వేగంగా రికవరీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కునుక మూడు నుంచి ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మరే ఇతర పెట్టుబడి సాధనంతో పోల్చి చూసినా.. రాబడుల విషయంలో మెరుగ్గా కనిపిస్తాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మెరుగైన రాబడులు వీటి నుంచి ఆశించొచ్చు. లార్జ్‌క్యాప్‌ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న ఫండ్స్‌లో మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ కూడా ఒకటి.  
రాబడులు 
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రనూ.30,804 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. నిర్వహణ ఆస్తుల పరంగా పెద్ద పథకాల్లో ఇదీ ఒకటి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో ట్రెయిలింగ్‌ రాబడులు 39 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలోనూ వార్షికంగా సగటు రాబడులు 19 శాతానికిపైనే ఉన్నాయి. ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 14.53 శాతం, పదేళ్లలో 18.47 శాతం చొప్పున రాబడులను (ట్రెయిలింగ్‌) అందించింది. దీర్ఘకాలంలో సగటున 18 శాతాని ్జటపైనే రాబడులు ఇవ్వడాన్ని చక్కని పనీతీరుగానే పరిగణించాలి.  
పెట్టుబడుల విధానం.. 
గౌరవ్‌ మిశ్రా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. పథకం పెట్టుబడుల విధానాలకు అనుగుణంగా ఫండ్‌ నిర్వహణ, పరిశోధన బృందం వ్యూహాలు ఉండడం సానుకూలం. నాణ్యమైన కంపెనీలను పథకం ఎంపిక చేసుకుంటుంది. అలాగే, స్థిరమైన ఆదాయం, లాభాలను నమోదు చేస్తున్న వాటికి ప్రాముఖ్యం ఇస్తుంది. కంపెనీ యాజమాన్యం బలమైనదా? కాదా? అని చూస్తుంది. చివరిగా స్టాక్‌ వ్యాల్యూషన్‌ ఆకర్షణీయ స్థాయిలోనే ఉందా? లేక ఖరీదుగా మారిందా? అన్న అంశాలకు పెట్టుబడుల విషయంలో ఈ పథకం పరిశోధన బృందం ప్రాధాన్యం ఇస్తుంది. బోటమ్, టాప్‌డౌన్‌ రెండు రకాల విధానాలను అనుసరిస్తుంది. కీలకమైన రేషియోలను కూడా ప్రాధాన్యం ఇస్తుంది. గడిచిన పదేళ్ల కాలంలో కంపెనీ ఏ విధంగా వృద్ధి చెందింది, ఆయా రంగంలో వచ్చిన మార్పులు, కంపెనీ యాజమాన్యం అనుసరించిన విధానాలను అన్నింటినీ విశ్లేషించి.. రానున్న కాలంలోనూ చక్కని వృద్ధి దిశగా ప్రయాణించే వాటిని ఎంపిక చేసుకుంటుంది. మార్కెట్‌ విలువ పరంగా అగ్రగామి 100 కంపెనీలను లార్జ్‌క్యాప్‌ కంపెనీలుగా పేర్కొంటారు. మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 80 శాతానికి పైగా అధిక నాణ్యతతో కూడిన లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌చేస్తుంది. మరో 20 శాతం పెట్టుబడులను అధిక వృద్ధి అవకాశాలు కలిగిన మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలకు కేటాయిస్తుంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీలు ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని, వృద్ధిని ఇస్తాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ కంపెనీలు వృద్ధితోపాటు, అధిక రాబడులు తెచ్చేందుకు సాయపడతాయి.   
పోర్ట్‌ఫోలియో 
తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 99.20 శాతాన్ని ప్రస్తుతానికి ఈక్విటీలకు కేటాయించింది. పోర్ట్‌ఫోలియోలో 61 స్టాక్స్‌ను కలిగి ఉంది. ప్రస్తుతానికి మొత్తం పెట్టుబడుల్లో 84 శాతం లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 13.89 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులను కేటాయించింది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. 32.31 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే పెట్టి ఉంది. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు 15 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చింది.

టాప్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌ 
కంపెనీ                           పెట్టుబడుల శాతం 
ఇన్ఫోసిస్‌                           8.83 
ఐసీఐసీఐ బ్యాంకు                  8.68 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు               8.49 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌               6.60 
ఎస్‌బీఐ                              4.62 
యాక్సిస్‌ బ్యాంకు                   4.40 
టీసీఎస్‌                             3.24 
భారతీ ఎయిర్‌టెల్‌                  3.04 
ఎల్‌అండ్‌టీ                         2.31 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top