
విద్యా సంస్థలు, ఆస్పత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్‌లలో కిరాయిలు హాట్‌కేక్‌లా మారాయి. – సాక్షి, సిటీబ్యూరో
అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు 6 నెలల్లో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్‌పల్లి, మారెడ్‌పల్లి, అల్వాల్‌లో 20-25 శాతం అద్దెలు పెరిగాయి.
నడ్డివిరుస్తున్న అద్దెలు..
హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు కిరాయి దారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి, పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10-15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10-15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20-25 వేలకు పైగా ఖర్చు చేస్తే తప్ప దొరకని పరిస్థితి.
అడ్వాన్స్‌లు, మెయింటెనెన్స్‌ల భారం..
ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3-4 నెలలు అడ్వాన్స్‌లను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతోంది. 2 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.