వైజాగ్‌లో కోరమాండల్‌ కొత్త ప్లాంటు

Coromandel Plans 1, 650 Tonne Sulphuric Acid Plant In Vizag For Rs 400 Crore - Sakshi

సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి కోసం ఏర్పాటు 

రూ. 400 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మురుగప్ప గ్రూప్‌ సంస్థ, ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు ప్రకటించింది. విశాఖపట్నంలోని తమ ఎరువుల కర్మాగారంలో కొత్తగా సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇందుకోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చిస్తోన్నట్లు సంస్థ తెలిపింది.

దీనికి సంబంధించి ఎంఈసీఎస్‌ (మోన్‌శాంటో ఎన్విరో–కెమ్‌ సిస్టమ్స్‌), టీకేఐఎస్‌ (థిసెన్‌క్రప్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌)తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.  రోజుకు 1,650 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ అరుణ్‌ అలగప్పన్‌ తెలిపారు.

భారత్‌ ప్రస్తుతం సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచుకుని, దిగుమతులు తగ్గించుకోవాలన్న స్వావలంబన భారత్‌ లక్ష్య సాకారం దిశగా కొత్త ప్లాంటు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం వార్షికంగా 6 లక్షల టన్నులుగా ఉన్న సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి సామర్థ్యం .. మరో 5 లక్షల టన్నుల మేర పెరిగి 11 లక్షల టన్నులకు చేరుతుంది.

ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్న దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఈ పెట్టుబడులు చేస్తున్నట్లు అరుణ్‌ తెలిపారు. ప్రస్తుతం వైజాగ్‌లోని కోరమాండల్‌ ఫ్యాక్టరీ ఏటా 13 లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, దాదాపు 4 లక్షల టన్నుల క్యాప్టివ్‌ ఫాస్ఫోరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top