
పోటీ మధ్య విజయం కోసం కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ఆరాటం
అనైతిక విధానాలను అనుసరిస్తున్నాయి
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్
ముంబై: కొన్ని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్రమైన పోటీ ఒత్తిళ్ల మధ్య తాత్కాలిక విజయాల కోసం అనైతిక విధానాలను అనుసరిస్తున్నాయంటూ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే ఆరోపించారు. తమిళనాడులోని కరూర్‌లో ప్రైవేటు బ్యాంక్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లక్ష్యం మంచిదైనప్పుడు దాన్ని సాధించడానికి ఏ పద్ధతి అనుసరించినా మంచిదే’అన్నట్టు సంబంధిత రుణ దాతల యాజమాన్యాలు భావిస్తున్నాయంటూ.. ఆ తరహా విధానాలు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేస్తాయని హెచ్చరించారు.
క్రియేటివ్ అకౌంటింగ్ (నిబంధనల్లో లోపాలను ఆసరాగా చేసుకుని గణాంకాలను సానుకూలంగా పేర్కొంటూ తప్పుదోవ పట్టించడం), నిబంధనలకు కచి్చతంగా కట్టబడకుండా స్వేచ్ఛగా వ్యవహరించడం, అంతర్గతంగా సరైన నియంత్రణలు లేకపోవడం వంటివి కొన్ని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల్లో సాధారణంగా మారిపోయినట్టు చెప్పారు. దీంతో ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాల్సి వస్తోందని స్వామినాథన్ వివరించారు. నైతిక మార్గంలోనే వృద్ధి ప్రక్రియలను అనుసరించడం అవసరమన్నారు.
నమ్మకమైన వ్యవస్థలు, బాధ్యతాయుతమైన నాయకత్వం, స్పందించే సేవలతో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత బ్యాంక్ బోర్డులు, యాజమాన్యాలపై ఉన్నట్టు గుర్తు చేశారు. ఒక బ్యాంక్‌కు గుర్తింపే పెద్ద ఆస్తి అవుతుందన్నారు. పోటీ పెరిగిపోయి, కస్టమర్ల అంచనాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో కస్టమర్ ప్రాధాన్యంగా సేవలు అందించడం ద్వారానే నమ్మకం, విశ్వసనీయతకు తోడు, దీర్ఘకాలంలో విలువ సమకూర్చుకోవడం సాధ్యపడుతుందన్నారు. నియంత్రణపరమైన అవసరాల కోసమని నంబర్లను పెంచి చూపించడం కాకుండా.. ఆర్థిక వనరులను ఏ విధంగా వినియోగిస్తున్నారన్నది ముఖ్యమని సూచించారు.
జవాబుదారీగా నడుచుకోవాలి..
కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, కొత్త ప్రాంతాల్లోకి సేవల విస్తరణ పరంగా సరైన స్పష్టత, సమన్వయం, జవాబుదారీతనం అవసరమని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకుంటున్నట్టే, సైబర్ భద్రత, డేటా నిర్వహణపైనా బలమైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని సూచించారు. టెక్నాలజీ అంతరాలను వేగంగా పరిష్కరించకుంటే వ్యవస్థాగత బలహీనతకు దారితీస్తుందని హెచ్చరించారు.