న్యూఢిల్లీ: టెక్నాలజీ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ సైబర్ రిస్కులను ఏడాదికోసారి కాకుండా మూడు నెలలకోసారి మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని డెలాయిట్ ఇండియా రిస్క్ అడ్వైజరీ పార్ట్‌నర్ దిగ్విజయసింహ చుదసమా తెలిపారు.
కంపెనీలే కాకుండా ప్రజలు కూడా సైబర్ రక్షణ కోసం స్వీయ–మార్గదర్శకాలను రూపొందించుకోవాలని, కీలకమైన డేటాను షేర్ చేయడం వల్ల తలెత్తే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. హ్యాకర్లు మరింత అధునాతనమైన పద్ధతుల్లో సైబర్ దాడులకు దిగుతున్నందున ఈ తరహా రక్షణాత్మక చర్యలు అవసరమని చుదసమా వివరించారు. తమ ప్రయోజనాలను, తమ డేటాను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడే విధానాలను రూపొందించుకోవడంపై కంపెనీలు కసరత్తు ప్రారంభించాలని ఆయన సూచించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
