
పిల్లల ఎత్తు, బరువునూ ఇట్టే కొలుస్తుంది
ఆరోగ్య సమస్యను ముందే గుర్తించే అవకాశం
కచ్చితత్వంతో సత్ఫలితాలిస్తున్న ప్రాజెక్టులు
హెల్త్‌కేర్ రంగాన్ని మారుస్తున్న సాంకేతికత
దేశంలో అయిదేళ్లలోపు పిల్లల్లో 50 శాతంపైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బిడ్డ పుట్టిన తొలి ఆరు వారాలు కీలక సమయం. చాలా మంది శిశువులకు ఈ సమయంలో ఆరోగ్య సంబంధ తనిఖీలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పేదలుండే ప్రాంతాలలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. ఎదుగుతున్న తీరు, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నదీ లేనిదీ సరైన సమయంలో గుర్తించి సమస్యను పరిష్కరించలేకపోవడంతో శిశువులు పోషకాహార లోపం బారిన పడుతున్నారు. దీనికి విరుగుడుగా పలు సంస్థలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పరిష్కారాలతో రంగంలోకి దిగాయి. వీటిలో ఐఐఐటీ హైదరాబాద్ కూడా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్టులు విజయవంతమై, పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి వస్తే ఆరోగ్య రంగంలో పెద్ద అడుగు పడినట్టే.
శిశువులు పుట్టినప్పుడు 2.5 కిలోల కంటే తక్కువ బరువు ఉండటం.. బాల్యంలో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ శిశువులు ఎదుగుదల నిలిచిపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, ప్రాణాంతక పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరిలో కేలరీల లోపం వల్ల సన్నబడడం; ప్రొటీన్ లోపం వల్ల కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తద్వారా కాలేయం దెబ్బతినడం, రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. ఈ సమస్యలను గుర్తించడం ఆలస్యం అయితే ప్రాణాలకే ప్రమాదం. శిశువు పుట్టిన మొదటి ఆరు వారాలలో తరచూ పర్యవేక్షణ చేపట్టడం వల్ల సమస్య ఏదైనా ఉంటే.. ఆలస్యం కాకముందే సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు ఏఐ తన వంతు సాయం చేస్తోంది.
ఐఐఐటీ హైదరాబాద్ సైతం..
నవజాత శిశువులు మొదలుకుని అయిదేళ్లలోపు పిల్లల వరకు ఏఐ సాంకేతిక సాయంతో బరువు, పొడవు, ఎత్తు.. అలాగే తల, ఛాతీ కొలతల ఆధారంగా వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసి.. వారిని ఆరోగ్యవంతంగా ఎదిగేలా చేయాలన్నది ఈ ప్రాజెక్టుల లక్ష్యం. పిల్లల ఎత్తు, బరువు కొలిచేందుకు సంప్రదాయ సాధనాల అవసరం లేకుండా తక్కువ సమయంలో, కచ్చిత సమాచారాన్ని అందించడంలో ఈ ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం తరఫున క్షేత్ర స్థాయిలో పనిచేసే హెల్త్ వర్కర్లకు పని భారం సైతం తగ్గుతుండడం కలిసి వచ్చే అంశం. వాధ్వానీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఏఐ, రెవల్యూషనైజ్, వెల్ట్ హంగర్ లైఫ్ / మైక్రోసాఫ్ట్‌తోపాటు ఐఐఐటీ హైదరాబాద్ సైతం ఈ ప్రాజెక్టులు చేపట్టిన సంస్థల జాబితాలో ఉంది.
శిశు మాపన్ : వాధ్వానీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఏఐ శాస్త్రవేత్తలు ఈ యాప్‌ను రూపొందించారు. 42 రోజుల లోపు వయసున్న నవజాత శిశువుల బరువు, పొడవు, తల, ఛాతీ చుట్టుకొలతను ఈ యాప్ ద్వారా తెలుసుకుంటారు. ఈ యాప్‌ను ఇంటర్నెట్ లేకపోయినా వాడొచ్చు. శిశువును ఓ వస్త్రంపై పడుకోబెట్టి, పక్కన స్కేల్ ఉంచి షార్ట్ వీడియో తీస్తే చాలు.. వివరాలు యాప్‌లో ప్రత్యక్షం అయిపోతాయి. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ , తక్కువ వెలుతురులోనూ ఇది పనిచేస్తుంది. డామన్ –డయ్యూలో 2024 నుంచి ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోంది. ఇప్పటికే 30,000 పైచిలుకు పిల్లల కొలతలను తీసుకున్నారు. గృహ – ఆధారిత నవజాత శిశువుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆశ కార్యకర్తలు ఇంటికే వచ్చి పిల్లల ఎదుగుదలను పర్యవేక్షిస్తారు. పోషకాహార లోపం గుర్తిస్తే ప్రభుత్వ పోషకాహార కార్యక్రమాలతో తల్లులను అనుసంధానిస్తారు.
ఎంఏఏపీ: పోషకాహార లోపం అంచనా, కార్యాచరణ ప్రణాళిక పేరుతో రెవల్యూషనైజ్ అనే కంపెనీ రాజస్తాన్‌లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా 6 నెలల నుంచి అయిదేళ్ల వయసున్న పిల్లల ఎత్తును అంచనా వేయడానికి, పోషకాహారలోప ప్రమాదాలను గుర్తించడానికి స్మార్ట్‌ఫోన్ తో తీసిన ఫొటోలను ఉపయోగిస్తారు. ఎత్తు, పోషకాహార స్థాయికి తగ్గట్టుగా ఏ ఆహారం తీసుకోవాలో సూచిస్తారు. దీనికి కూడా ఇంటర్నెట్ అవసరం లేదు. ఆరోగ్య కార్యకర్తలు మారుమూల పల్లెల్లో కూడా వెళ్లి పోషకాహార లోపంతో బాధపడే పిల్లలను గుర్తించేందుకు ఈ యాప్ సాయపడుతుంది. ప్రభుత్వ వైద్య శాఖలకు ఈ యాప్‌ను ఉచితంగా అందజేస్తామని కంపెనీ చెబుతోంది.
ఐఐఐటీ–హైదరాబాద్: నవజాత శిశువులతోపాటు అయిదేళ్లలోపు పిల్లలు.. వెయింగ్ మెషీన్, హైట్ చార్టుల వద్ద ఉన్నప్పుడు ఫొటోలు తీస్తారు. వాటిని యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ ఎత్తు, బరువులు ఆరోగ్యకరమైనవి ఉన్నాయా లేదా అని విశ్లేషిస్తారు. ఈ యాప్‌ను ఐ–సాక్షమ్ సహకారంతో తెలంగాణలో పరీక్షిస్తోంది. ప్రొటోటైప్ ప్రస్తుతం పైలట్ దశలో ఉంది.
వెల్ట్ హంగర్ లైఫ్ /మైక్రోసాఫ్ట్: ఈ సంస్థలు అభివృద్ధి చేసిన చైల్డ్ గ్రోత్ మానిటర్ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల ఎత్తు, బరువు, శరీర కొలతల కోసం 3డీ ఇన్ ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగిస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికే 10,000కు పైచిలుకు స్కాన్ ్స పూర్తి చేశారు. గ్రోత్ మానిటర్ ఫలితాల్లో కచ్చితత్వం ఉంది. హార్డ్‌వేర్ ఖరీదు కావడం, సెన్సార్లపై ఆధారపడి పని చేస్తుండడంతో క్షేత్ర స్థాయిలో వినియోగాన్ని పరిమితం చేస్తోంది.