
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురించి తెలియనివారెవరూ ఉండరు. మధ్యప్రదేశ్‌కు చెందిన డిగ్గీరాజా కాంగ్రెస్ హయాంలో దేశ రాజకీయాల్లో తన అమితమైన ప్రభావాన్ని చూపారు. కొంతకాలంగా రాజకీయంగా స్థబ్ధుగా ఉన్న ఆయన ఇప్పుడు మరింత యాక్టివ్‌గా మారి, తన దూకుడును పెంచారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలో తన రాజకీయ కార్యకలాపాలను ఇటీవలి కాలంలో మరింతగా పెంచారు. ఇది పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు, కాంగ్రెస్‌కు నూతన దిశను సూచిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలోని వైద్య వ్యవస్థ, సంక్షేమంపై ఆయన దృష్టి సారించారు. ఇది ఆయనను అట్టడుగు స్థాయి వర్గాలతో అనుసంధానం అయ్యేందుకు దోహదపడుతుంది. తద్వారా ఆయన తిరిగి ప్రజల్లో ఆదరణ పొందాలని భావిస్తున్నారని సమాచారం.
తాజాగా దిగ్విజయ్ సింగ్ బుందేల్‌ఖండ్‌లో క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బాగేశ్వర్ ధామ్ స్వామిజీ ధీరేంద్ర శాస్త్రి చూపిన చొరవను ప్రశంసించారు. ఇటువంటి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను విరివిగా కల్పించాలని, అప్పుడే పేదలకు వైద్యసాయం అందుతుందని అన్నారు. ప్రభుత్వాలు ఆస్పత్రులు, పాఠశాలలు నెలకొల్పడంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనాలను రెట్టింపు చేయాలని, వారి కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కీలక పోటీదారుగా ఉండాలని భావిస్తున్నటు సమాచారం. తన ప్రసంగంలో ప్రత్యర్థులపై ప్రశంసలతో పాటు నిర్మాణాత్మక విమర్శలను జోడించే సింగ్ వ్యూహం విస్తృత శ్రేణి ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.