ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) తన పాత ఐకానిక్ కారు 2 CVను సరికొత్త రూపంలో తిరిగి లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. 2026 పారిస్ మోటార్ షోలో ప్రదర్శించిన 2 CV కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన ఒక కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది.
సిట్రోయెన్ 2 CV కారును హ్యాచ్‌బ్యాక్, పికప్ అనే రెండు వెర్షన్లలో తీసుకురానున్నట్లు సమాచారం. 1948లో తొలిసారిగా పరిచయమైన ఒరిజినల్ 2 CV తక్కువ ధర, సింపుల్ డిజైన్, రోజువారీ అవసరాలకు అనుకూలమైన పనితీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే ప్రత్యేకతలను సరికొత్త టెక్నాలజీలతో మళ్లీ అందించాలని కంపెనీ యోచిస్తోంది.
కొత్త 2 CV కాన్సెప్ట్ పొడవు 3.76 మీటర్లు. గుండ్రటి హెడ్ల్యాంపులు, వంపులతో కూడిన రూఫ్‌లైన్, ప్రత్యేకమైన బాడీ డిజైన్‌తో పాత మోడల్‌ను గుర్తు చేస్తుంది. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్, విశాలమైన సీట్లు, ఫ్యాబ్రిక్ సన్‌రూఫ్, రిమూవబుల్ స్టోరేజ్ బాస్కెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కారు బరువును సుమారు ఒక టన్ను దగ్గర ఉంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బ్యాటరీ, తయారీ ఖర్చులను నియంత్రించి, కారును అందుబాటు ధరలో తీసుకురావాలని భావిస్తోంది. ఈ కొత్త మోడల్ ఎలక్ట్రిక్ కారుగా వచ్చే అవకాశం ఉంది. అయితే, బ్యాటరీ సామర్థ్యం, ఒక్కసారి ఛార్జింగ్‌తో ప్రయాణించే దూరం, ఛార్జింగ్ సమయం వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
యూరప్‌లో దీని ప్రారంభ ధర సుమారు 15,000 యూరోలు (దాదాపు రూ.16 లక్షలు) ఉండొచ్చని అంచనా. కానీ భారత్‌లో ఇదే ధరకు అందుబాటులోకి వస్తుందని చెప్పలేం. స్థానిక తయారీ, బ్యాటరీ ఖర్చులు, దిగుమతి విధానాలను బట్టి ధర మారవచ్చు. భారత్‌లో లాంచ్ తేదీపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. సిట్రోయెన్ మాతృసంస్థ స్టెల్లాంటిస్ భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. దీనికోసం కంపెనీ అదనంగా సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి భారత్‌లో మొత్తం రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
ఇదీ చదవండి: ఫుల్ ఛార్జ్‌పై 440 KM రేంజ్.. స్కోడా కొత్త కారు!


