టయోటా కంపెనీ.. తన గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో రూ. 6.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పవర్‌ట్రెయిన్, ఫీచర్స్, డిజైన్‌లో స్వల్ప మార్పులు పొందింది. ఇది దేశంలో హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
డిజైన్
2026 టయోటా గ్లాంజా డిజైన్ విషయానికి వస్తే.. దీని ముందు భాగంలో ప్రధాన మార్పులు జరిగినట్లు స్పష్టమవుతోంది. పెద్ద గ్రిల్ చూడవచ్చు. సాధారణంగా ఇది బ్రాండ్‌లోని ఖరీదైన మోడళ్లలో కనిపిస్తుంది. ఇందులో రాడార్ మాడ్యూల్స్ ఉన్నాయి. అదే సమయంలో, హెడ్‌లైట్ డిజైన్ పాత మోడల్ మాదిరిగానే ఉంది, కానీ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కొత్తగా డిజైన్ చేశారు. బ్రాండ్ లోగో ఇప్పుడు బోనెట్‌పై చూడవచ్చు. ఈ కొత్త కారు డిజిటల్ టీల్ గ్రీన్, బ్లూయిష్ బ్లాక్ అనే రెండు కొత్త రంగులలో లభిస్తుంది.
ఫీచర్స్
లోపలి భాగంలో.. గ్లాంజా ఇప్పుడు లెదరెట్ సీట్ అపోల్స్ట్రేను పొందుతుంది. క్యాబిన్ మధ్యలో ఇప్పటికీ ఫ్రీ ఫ్లోటింగ్ 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు, కలర్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే (MID)తో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. అయితే.. ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్‌ను చేర్చడంతో ఫీచర్ల సెట్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఇది నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్లతో కూడిన క్లారియన్ సౌండ్ సిస్టమ్‌ను, రియర్ ఏసీ వెంట్లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను కూడా పొందుతుంది.
సేఫ్టీ ఫీచర్స్
సేఫ్టీ కోసం కంపెనీ.. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లను అందిస్తోంది.
ఇంజిన్ డీటెయిల్స్
2026 గ్లాంజా కొత్త 1.2-లీటర్, 3-సిలిండర్ Z12E ఇంజన్‌ను పొందుతుంది. ఇది పెట్రోల్ లేదా సీఎన్జీపై నడుస్తుంది. పెట్రోల్ రూపంలో, ఇది 83 హార్స్ పవర్, 112 న్యూటన్ మీటర్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: 2026 రేడియాన్ బైక్ లాంచ్.. రూ.67000 మాత్రమే!


