ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా 2026 పారిస్ మోటార్ షోలో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎపిక్ స్పోర్ట్లైన్ను పరిచయం చేసింది. ఈ కారుకు స్పోర్టీ లుక్తో పాటు ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. బ్లాక్ రూఫ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్లు, ప్రత్యేకమైన ఫ్రంట్ గ్రిల్ ఈ కారుకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.
కారు లోపలి భాగంలో బ్లాక్ కలర్ థీమ్, సౌకర్యవంతమైన సీట్లు, యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా.. స్పోర్టీ లుక్తో పాటు ప్రీమియం అనుభూతిని అందించేలా ఇంటీరియర్ను రూపొందించారు.
ఈ కారు రెండు వెర్షన్లలో (ఎపిక్ 40, ఎపిక్ 55) అందుబాటులో ఉంటుంది. ఎపిక్ 40లో 37 kWh బ్యాటరీ ద్వారా.. 310 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఎపిక్ 55లోని 55 kWh బ్యాటరీ.. 440 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ వెర్షన్ 207 bhp పవర్ను అందిస్తూ, కేవలం 7.1 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.
అయితే.. స్కోడా ఎపిక్ స్పోర్ట్లైన్ను భారత్లో ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే కంపెనీ కారును స్థానికంగా తయారు చేయడం, తగిన ధరతో అందుబాటులో ఉంచడం, ప్రభుత్వ సబ్సిడీలు మొదలైన అంశాలను పరిశీలిస్తోంది.


