ఆఫీస్ అద్దెకు రూ.189 కోట్లు.. జపాన్ కంపెనీ భారీ డీల్! | Japan Company Leases in Mumbai BKC Total Rent of Rs 189 Crore | Sakshi
Sakshi News home page

ఆఫీస్ అద్దెకు రూ.189 కోట్లు.. జపాన్ కంపెనీ భారీ డీల్!

Oct 18 2026 5:31 PM | Updated on Oct 18 2026 5:51 PM

Japan Company Leases in Mumbai BKC Total Rent of Rs 189 Crore

భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీసులు లీజుకు తీసుకోవడానికి భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా.. జపాన్‌కు చెందిన ఒక కంపెనీ ఏకంగా రూ.189 కోట్లు డీల్ కుదుర్చుకుంది.

జపాన్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC) ముంబైలో ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ)లో దాదాపు 50 వేల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఐదేళ్ల కాలానికి అద్దెకు తీసుకుంది. ఈ ఒప్పందం మొత్తం విలువ సుమారు రూ.189 కోట్లు కావడం గమనార్హం.

జపాన్‌కు చెందిన సుమిటోమో రియల్టీ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ భారత విభాగమైన గోయిసు రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చింది. బీకేసీలోని సుమిటోమో C65 అనే వాణిజ్య భవనంలో 49,820 చదరపు అడుగుల స్థలాన్ని SMBC తీసుకుంది.

ఏడాదికి రూ.41.5 కోట్లు!
ఈ ఒప్పందం 2026 అక్టోబర్ 6న కుదిరింది. చదరపు అడుగుకు నెలకు రూ.694 చొప్పున అద్దె నిర్ణయించారు. ఈ లెక్కన నెలకు సుమారు రూ.3.46 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.41.5 కోట్ల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం ప్రతి మూడేళ్లకు అద్దె 15 శాతం పెరుగుతుంది. కాగా.. సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.35.11 కోట్లు. ఈ ఒప్పందంలో తొమ్మిది నెలల అద్దె మినహాయింపు కూడా ఉంది. అంటే ఆ కాలానికి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. అద్దె చెల్లింపులు 2027 జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి.

జపాన్‌కు చెందిన సుమిటోమో రియల్టీ సంస్థ భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. గతంలో ఇదే సంస్థ అభివృద్ధి చేస్తున్న బీకేసీలోని మరో వాణిజ్య భవనంలో అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ ప్రైవేట్ లిమిటెడ్ 1.16 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇందుకు నెలకు సుమారు రూ.6.91 కోట్ల అద్దె నిర్ణయించారు.

ముంబైలోని బీకేసీ దేశంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ కార్యాలయాలు, అమెరికా కాన్సులేట్‌తో పాటు ప్రముఖ హోటళ్లు ఉన్నాయి. గూగుల్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, టెస్లా, జియో వంటి పెద్ద కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో తమ కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి.

ఇదీ చదవండి: పండగొచ్చిందని బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement