
ఏప్రిల్‌లో 8 శాతం పెరుగుదల
అమెరికాకు మాత్రం 21 శాతం డౌన్
భారత్‌కు 16 శాతం అధికం
బీజింగ్: అమెరికా భారీ టారిఫ్‌లతో బాదేసినా, ఎగుమతుల పరంగా చైనా తన బలాన్ని చాటుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అంచనాలకు మించి ఎగుమతులు నమోదు చేసింది. ఏప్రిల్ నెలలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 8.1 శాతం వృద్ధితో 315.69 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాకు ఎగుమతులు 21 శాతం తగ్గినప్పటికీ, చైనా ఎగుమతుల్లో సానుకూల వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఏప్రిల్ నెలలో చైనా ఎగుమతులు కేవలం 2 శాతమే పెరగొచ్చన్నది విశ్లేషకుల అంచనాగా ఉంది.
ఇక ఈ ఏడాది మార్చి నెలలో చైనా ఎగుమతుల్లో వృద్ధి 12.4 శాతంతో పోల్చి చూసినప్పుడు ఏప్రిల్‌లో కొంత నిదానించినట్టు తెలుస్తోంది. చైనా దిగుమతులు 0.2 శాతం తగ్గాయి. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా 145 శాతానికి పెంచడం తెలిసిందే. దీనికి ప్రతిగా అమెరికా ఎగుమతి చేసే వాటిపై 125 శాతం టారిఫ్‌లను చైనా అమలు చేస్తోంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో యూఎస్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంపై చర్చలు జరగడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఈ డేటా విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యూఎస్‌తో తగ్గిన వాణిజ్య మిగులు
అమెరికాతో చైనాకి వాణిజ్య మిగులు 2024 ఏప్రిల్ నాటికి 27.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2025 ఏప్రిల్ నాటికి 20.5 బిలియన్ డాలర్లకు తగ్గింది. గడిచిన నాలుగు నెలల్లో అమెరికాకు చైనా ఎగుమతులు 2.5 శాతం క్షీణించాయి. అదే సమయంలో యూఎస్ నుంచి దిగుమతులు 4.7 శాతం తగ్గాయి. అమెరికాకు ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకోవడం ద్వారా ఏప్రిల్‌లో వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. దక్షిణాసియా దేశాలకు చైనా ఎగుమతులు ఏప్రిల్‌లో 11.5 శాతం పెరిగాయి. లాటిన్ అమెరికాకు 11.5 శాతం, భారత్‌కు విలువ పరంగా 16 శాతం చొప్పున పెరిగాయి.
ఆఫ్రికాకు సైతం 15 శాతం, వియత్నాంకు 18 శాతం, థాయిలాండ్‌కు 20 శాతం చొప్పున ఎగిశాయి. చైనా ఎగుమతుల వృద్ధి ఆర్థిక విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఎగుమతుల డేటా ఆశ్చర్యకరంగా ఉందని, తన అంచనా 2–3 శాతం మించి వృద్ధి నమోదైనట్టు సీనియర్ చైనా ఆర్థికవేత్త (ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్) షు టియాంచెన్ తెలిపారు. యూఎస్ టారిఫ్‌ల పూర్తి ప్రభావం డేటాలో ఇంకా ప్రతిఫలించనట్టు ఉందన్నారు. యూరేషియా గ్రూప్‌లో చైనా డైరెక్టర్‌గా ఉన్న డాన్ వాంగ్ సైతం బలమైన ఎగుమలు వృద్ధిని ఊహించలేదన్నారు.
చైనా సోలార్ గ్లాస్‌పై యాంటీ డంపింగ్ సుంకాలు
అయిదేళ్ల పాటు అమల్లో
న్యూఢిల్లీ: చైనా, వియత్నాం నుంచి దిగుమతయ్యే నిర్దిష్ట రకం సోలార్ గ్లాస్‌పై టన్నుకు 570 డాలర్ల నుంచి 664 డాలర్ల వరకు యాంటీ–డంపింగ్ సుంకాలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇవి అయిదేళ్ల పాటు అమల్లో ఉంటాయని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఈ రెండు దేశాల నుంచి చౌకగా దిగుమతయ్యే ఉత్పత్తుల నుంచి దేశీ తయారీ సంస్థలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా సోలార్ ప్యానెల్స్‌లో ఉపయోగించే ఈ తరహా గాజును సోలార్ గ్లాస్, సోలార్ పీవీ గ్లాస్ తదితర పేర్లతో వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో చైనా, వియత్నాం నుంచి ఈ గ్లాస్ దిగుమతులు గణనీయంగా పెరిగినట్లు వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్), దేశీ పరిశ్రమ తరఫున నిర్వహించిన విచారణలో వెల్లడైంది. డీజీటీఆర్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సుంకాల విధింపు నిర్ణయం తీసుకుంది.