
రిమోట్ వర్క్.. అదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా మంది ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఓపక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు ఉద్యోగాన్ని చూసుకుంటున్న వారికి ఈ విధానం చాలా అనువుగా ఉంటోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ రిమోట్ వర్క్ విధానం నెమ్మదిగా తొలగిపోతోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి.
సౌకర్యవంతమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడినవారు ఆఫీసులకు తిరిగివెళ్లడానికి ఇష్టపడటం లేదు. చాలా కంపెనీలు ఉద్యోగులను బలవంతంగానైనా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించడం ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఎలా బెడిసికొట్టిందో.. ఉద్యోగులు ఏం చేశారో చెబుతూ ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తి రెడ్డిట్‌లో షేర్ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారంది.
ఆఫీస్‌కు రాకపోతే ఏం చేస్తారు?
కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసిన కంపెనీ.. ఆ సమయంలో చాలా మందిని రిమోట్ వర్క్ విధానంలోనే నియమించుకుంది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందరూ క్రమంగా ఆఫీసులకు రావాలని యాజమాన్యం ఆదేశించింది. అసలు సమస్య ఏంటంటే.. దాదాపు చాలా మంది రిమోట్ వర్క్ విధానంలోనే ఉద్యోగాల్లో చేరారు. కొంత మంది తమ ప్రాంతాలకు మకాం మార్చారు. ఇప్పుడు వీళ్లకు ఎటువంటి ఆర్థిక సహకారం అందించకుండా ఏడాదిలోగా ఆఫీసులకు వచ్చేయాలని కంపెనీ చెబుతోంది.
దీంతో ఉద్యోగులు గందరగోళంలో పడిపోయారు. ఈక్రమంలో కంపెనీ వైడ్ టౌన్ హాల్ సమావేశంలో ఆఫీస్‌కు రావడానికి అయిష్టంగా ఉన్నవారికి మినహాయింపులేమైనా ఉంటాయా అని ఓ ఉద్యోగి నేరుగా సీఈవోనే అడిగేశారు. దానికి సీఈవో స్పందిస్తూ "మీరు ఇంటి నుండి పని చేయాలనుకుంటే, వేరే చోట ఉద్యోగం చూసుకోండి" అంటూ బదులిచ్చారు. దీంతో అవాక్కైన ఉద్యోగులు ఆన్‌లైన్ కాల్స్‌లోకి రావడం మానేశారు. చాలా మంది వెంటనే రాజీనామా చేశారు. ఎక్కువ మంది వెళ్లిపోవడంతో కంపెనీకి షాక్ తగిలింది. క్యూసీ ఉద్యోగులతోనే యాప్ డెవలప్‌మెంట్ చేయించాల్సి వచ్చింది.