ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష్యం దిశగా పెట్టుబడుల ఉపసంహరణ

Cea Krishnamurthy Subramanian Says Disinvestment Target On Track Of Public Sector - Sakshi

ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ 

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సోమవారం ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రెండు బ్యాంకులు, ఒక బీమా కంపెనీతోసహా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా 2021–22లో రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ‘వరుసగా ఎనమిది నెలలుగా ప్రతి నెలా రూ.లక్ష కోట్లకుపైగా జీఎస్టీ వసూలవుతోంది. వినియోగం పెరుగుతోందనడానికి ఇదే ఉదాహరణ. వృద్ధికి ఇది సానుకూల సంకేతం. కోవిడ్‌–19 తొలి దశతో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ ప్రభావం తక్కువగా ఉంది. ఈ సంవత్సరం లక్ష్యాలను సాధించడానికి చాలా ప్రాధాన్యత ఉంది. రూ.1.75 లక్షల కోట్లలో పెద్ద మొత్తం ఎల్‌ఐసీ ఐపీవోతోపాటు భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ ద్వారా సమకూరనుంది.

ప్రైవేటీకరణ కోసం 2021–22 గుర్తుండిపోయే సంవత్సరంగా భావిస్తున్నాను. మాకు ఇంకా తొమ్మిది నెలలు ఉన్నాయి. లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం ఉంది. ఉచితాల కోసం ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థకు కేవలం రూ.0.98 మాత్రమే సమకూరుస్తుంది.. అదే మూలధన వ్యయానికి ఉపయోగించినప్పుడు ఇది రూ.4.50లుగా ఉంది’ అని వివరించారు.  

చదవండి: బ్యాంకులకు కీలక సూచనలు చేసిన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top