
ప్రైవేటు రంగం కీలకంగా వ్యవహరించాలి
సీఈఏ అనంత నాగేశ్వరన్
ముంబై: అమెరికా టారిఫ్‌లకు సంబంధించి సవాళ్లు వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లో సమసిపోతాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. దేశం దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రైవేటు రంగం మరింత ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 2023–24లో జీడీపీ వృద్ధి 9.2 శాతం నుంచి 2024–25లో 6.5 శాతానికి తగ్గిపోవడానికి కఠిన రుణ పరిస్థితులు, లిక్విడిటీ అంశాలను కారణాలుగా పేర్కొన్నారు.
సరైన వ్యవసాయ విధానాలను అమలు చేస్తే నిజమైన జీడీపీ వృద్ధికి 25 శాతం అదనపు తోడ్పాటునిస్తాయన్నారు. రత్నాభరణాలు, రొయ్యలు, టెక్స్‌టైల్స్ రంగాలపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ, వీటిని ఎదుర్కోవడం కష్టమన్నారు. ప్రభావిత రంగాలతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి చర్యలు ఉంటాయంటూ, కొంత ఓపిక పట్టాలని కోరారు.
అమెరికా వాణిజ్య బృందం ఈ నెల చివర్లో భారత్‌కు చర్చలకు రానున్న నేపథ్యంలో.. అలాస్కాలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగే సమావేశం ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. టారిఫ్ సంబంధిత అంశాలపై దృష్టి పెడుతూ.. అదే సమయంలో ముఖ్యమైన సవాళ్లను విస్మరించరాదన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా పడే ప్రభావం, కీలక ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడడం వంటి సవాళ్లను ప్రస్తావించారు. రానున్న సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో, ప్రైవేటు రంగం సైతం దీర్ఘకాల దృష్టితోనే ఆలోచించాలని సూచించారు.
విధానపరమైన మద్దతు
పరిశోధనల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని, తమ వంతు పెట్టుబడులు పెంచాల్సిన బాధ్యత ప్రైవేటు రంగంపై ఉన్నట్టు సీఈఏ అనంత నాగేశ్వరన్ చెప్పారు. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దేశీయంగా వినియోగం బలంగా ఉన్నట్టు చెప్పారు. చైనాతో 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ.. దిగుమతులను మరిన్ని దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషించాలని కోరారు.