
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ తొలగింపులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
రెనాల్ట్ కంపెనీ.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించనుంది. మొత్తం మీద సంస్థ తన మొత్తం ఉద్యోగులలో 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలగింపులు సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రదేశాలలో కూడా ఉన్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెనాల్ట్ కంపెనీ 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 98,636 మంది సిబ్బందిని నియమించింది. ''ఆటోమోటివ్ మార్కెట్‌లోని అనిశ్చితులు.. పోటీ వాతావరణం దృష్ట్యా, మా కార్యకలాపాలను సరళీకృతం చేయడానికి తగిన మార్గాలను పరిశీలిస్తున్నాము. ఇందులో భాగమని లేఆఫ్స్ కూడా చేయడానికి చూస్తున్నట్లు'' రెనాల్ట్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?
రెనాల్ట్ జూలై ఆర్థిక నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 11.2 బిలియన్ యూరోల (13 బిలియన్ డాలర్లు) నష్టాన్ని చవిచూసింది. ఇందులో భాగస్వామి నిస్సాన్‌పై కూడా 9.3 బిలియన్ యూరోల నష్టం ఉంది. కంపెనీ నికర ఆదాయం కూడా 461 మిలియన్ యూరోలకు తగ్గిపోయింది. ఖర్చులు పెరగడం.. పెరుగుతున్న పోటీ వాతావరణం నుంచి ఉత్పన్నమయ్యే వాణిజ్య ఒత్తిళ్లు ఈ తగ్గుదలకు కారణమని సమాచారం.