మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్స్‌ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చా? ఈ విషయాలు తెలుసా?

Can I gift a mutual fund to someone Or transferred - Sakshi

ఫండ్‌ పథకంలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా?    – శ్రీలలిత 

మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్‌ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్‌ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే నేరుగా వారి పేరుతో ఇన్వెస్ట్‌ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది. అటువంటప్పుడు పిల్లలు మేజర్‌ అయ్యే వరకు తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులపై సంరక్షకులుగా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్‌తోపాటు, గార్డియన్‌ కేవైసీ వివరాలను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న ఫండ్‌ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. మీ పేరిట ఉన్న పెట్టుబడులను విక్రయించేసి, వచ్చిన మొత్తాన్ని పిల్లల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత వారి పేరిట కొనుగోలు చేసుకోవాలి. మూడో వ్యక్తి (థర్డ్‌ పార్టీ) నుంచి పెట్టుబడిని ఫండ్స్‌ సంస్థలు ఆమోదించవు. ఫండ్స్‌ యూనిట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనుక బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి నగదు బదిలీ చేసి, కొనుగోలు చేసుకోవడం ఒక్కటే మార్గం.  

నేను ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేస్తున్న ఓ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం స్టార్‌ రేటింగ్‌ 4 ఉండేది కాస్తా, 3కు తగ్గింది. అందుకుని ఈ పెట్టుబడులను విక్రయించేసి, తిరిగి 4 లేదా 5 స్టార్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ మొత్తం ఒకే విడత చేయాలా..? లేక సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో చేసుకోవాలా? – రాజ్‌దీప్‌ సింగ్‌ 

ఓ పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్‌ రేటింగ్‌ను 4 నుంచి 3కు తగ్గించడం ఒకే కారణంగా ఉండకూడదు. 3 స్టార్‌  చెత్త పనితీరుకు నిదర్శనం కానే కాదు.  3 స్టార్‌ రేటింగ్‌ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్, మూలధన లాభాల అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోండి. విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనది. ముందుగా ఎగ్జిట్‌ లోడ్‌ లేని, దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇది పన్ను ఆదా అవుతుంది.

-ధీరేంద్ర కుమార్‌సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌ 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top