పతంజలి ప్రమోటర్ల వాటాలు సీజ్‌

Bourses freeze promoter shares in Patanjali Foods - Sakshi

25 శాతం ప్రజల వాటా నిబంధనలో వైఫల్యం

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ చర్య

ఎలాంటి ప్రభావం పడదన్న పతంజలి ఫుడ్స్‌

న్యూఢిల్లీ: ప్రజల వాటా కనీసం 25 శాతం ఉండాలన్న నిబంధన అమలులో విఫలమైనందుకు పతంజలి ఫుడ్స్‌ ప్రమోటర్ల వాటాలను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ స్తంభింప (ఫ్రీజ్‌) చేశాయి. ఈ చర్య కంపెనీ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపించదని పతంజలి ఫుడ్స్‌ పేర్కొంది. పతంజలి ఆయుర్వేద్‌ సహా 21 ప్రమోటర్‌ సంస్థల వాటాలను స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లు ఫ్రీజ్‌ చేసినట్టు పతంజలి అంతకుముందు ప్రకటించింది. ‘డిస్‌క్లోజర్‌’ నిబంధనల కింద స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తాజా విషయాన్ని తెలియజేసింది.

కనీస ప్రజల వాటా నిబంధన అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రమోటర్ల నుంచి తమకు సమాచారం అందినట్టు పతంజలి ఆయుర్వేద్‌ తెలిపింది. ప్రజల వాటాను పెంచేందుకు మెరుగైనది ఏదనే విషయమై వారు చర్చిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే కొన్ని నెలల్లో ఈ నిబంధనను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్లకు 80.82 శాతం వాటా ఉంది. నిబంధనల ప్రకారం 75% మించకూడదు. అంటే మరో 5.82% వాటా విక్రయించాల్సి ఉంటుంది.
 
నేపథ్యం..: రుచి సోయా ఇండస్ట్రీస్‌ (పతంజలి ఫుడ్స్‌ పూర్వపు పేరు)ని దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2019 సెప్టెంబర్‌లో పతంజలి గ్రూప్‌ సొంతం చేసుకుంది. దీంతో సంస్థలో ప్రమోటర్లు, ప్రమోటర్ల సంస్థలకు 98.87 శాతం వాటా లభించింది. 2022 మార్చిలో ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు పతంజలి ఫుడ్స్‌ వచ్చింది.  రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ. 648 చొప్పున 6.61 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో ప్రజల వాటా 19.18 శాతానికి పెరిగింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్‌ 18 నాటికి ప్రజల వాటా 25%కి చేర్చాల్సి ఉంది.

మరో ఎఫ్‌పీవో: బాబా రామ్‌దేవ్‌  
ఏప్రిల్‌లో మరో విడత ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో) చేపట్టనున్నట్టు పతంజలి ఫుడ్స్‌ ప్రకటించింది. తద్వారా ప్రజల వాటా కనీసం 25% ఉండాలన్న నిబంధనను అమలు చేస్తామని తెలిపింది. పతంజలి గ్రూప్‌ అధినేత బాబా రామ్‌దేవ్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదన్నారు. పతంజలి ఫుడ్స్‌ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎక్సే్ఛంజ్‌ల చర్య ప్రభావం చూపించదని భరోసా ఇచ్చారు. తాము 6% వాటాలను తగ్గించుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే జాప్యానికి కారణమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిశాక ఏప్రిల్‌లో ఎఫ్‌పీవో చేపడతామన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top