Zomato మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు

Bengaluru woman Claims Zomato Removed Her Negative Review here what Company Reply - Sakshi

బెంగళూరు:  ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు తాజాతా మరో ఎదురు దెబ్బ తగిలింది. జనరల్‌గా ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేసేటపుడు, షాపింగ్‌ చేసేటపుడు, హోటల్‌కు వెళ్లేటపుడు రివ్యూలపై ఎక్కువ ఆధారపడతాం. ఎక్కువ రేటింగ్‌, పాజిటివ్‌ రివ్యూలు ఉన్నవాటిని మరో ఆలోచన లేకుండా ముందుకు పోతాం. అయితే జొమాటో తన ప్లాట్‌ఫాంలో నెగిటివ్‌ రివ్యూలను డిలీట్‌ చేసిందట. ఈ మేరకు  బెంగళూరుకు చెందిన ఒక మహిళా యూజర్‌ ఫిర్యాదు ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. 

వివరాల్లోకి వెళితే..బెంగళూరుకు చెందిన దిశా సంఘ్వీ కోరమంగళలోని ఓ రెస్టారెంట్‌ కెళ్లి భోజనం చేశారు. అయితే ఆతర్వాత తనకు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్  అయ్యిందంటూ  జొమాటోలో రివ్యూ ఇచ్చారు. అంతేకాదు ఇలాంటి అనుభవం కేవలం తన ఒక్కదానికి మాత్రమే పరిమితం  కాలేదని ఆరోపించారు.  తన సహోద్యోగి కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యాడని, గత కొన్ని నెలల్లో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్న అనేక మంది తన దృష్టికి వచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ రివ్యూని తొలగించడం వివాదాన్ని  రేపింది.  (Bharti Airtel:అదరగొట్టిన భారతి ఎయిర్టెల్‌)

తన రివ్యూని జొమాటో తొలగించడంపై దిశా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కంపెనీ తొలగించిన తన రివ్యూ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో ఆదివారం షేర్‌ చేశారు. అలాగే తన రివ్యూను తొలగిస్తూ జొమాటో అలర్ట్‌ ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు సరైన ప్లాట్‌ఫారమ్ కాదని  జొమాటో ఇమెయిల్‌లో పేర్కొంది. ప్లాట్‌ఫారమ్‌లో వచ్చిన రివ్యూ  తనిఖీలో భాగంగా కంటెంట్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు గమనించామని అందుకే ఆ రివ్యూని తొలగించామని వివరణ ఇచ్చినట్టు ఇందులో ఉంది. దీంతో కొన్ని గంటల్లోనే ఆమె ట్వీట్ వైరల్‌గా మారింది. వేల కొద్దీ లైక్‌లు వందల కొద్దీ రీట్వీట్లు , కామెంట్ల వెల్లు వెత్తింది. ఇక తప్పక జొమాటో స్పందించింది.  ఫోన్ నంబర్ / ఆర్డర్ ఐడీని ప్రైవేట్ మెసేజ్ ద్వారా షేర్ చేయాలని  ఈ విషయాన్ని వెంటనే పరిష్కరిస్తాంటూ జొమాటో రిప్లై ఇచ్చింది. 

అయితే ఇంటర్నెట్ వినియోగదారులు కంపెనీ చెబుతున్నకంటెంట్ మార్గదర్శకాలపై మండిపడుతున్నారు. తమ అనుభవాన్ని షేర్‌ చేస్తే 'దుర్వినియోగం'  అంటున్నారు. ఇక కమెంట్స్‌ ఆప్షన్‌ దేనికి?" అని ఒక వినియోగదారు ప్రశ్నించారు."హలో జొమాటో! నేను చూడాలనుకుంటున్నది సరిగ్గా ఇలాంటి రివ్యూనే. ఆహారం యావరేజ్‌గా ఉంటే, అది కేవలం ప్రయత్నించి దాటవేయడం మాత్రమే. కానీ ఆ ఆహారం నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలిగితే, అది ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన విషయం. సమాధానం చెప్పాలి అని మరొకరు రాశారు. "హే జొమాటో,  అసలు మీ నిబంధనల్లోనే ఏదో తీవ్రమైన లోపం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి  విషయాలనే రిపోర్ట్‌ చేయాలి. వినియోగదారులకు  అవగాహన కలగాలి. ఇది అన్యాయమైతే సదరు విక్రేతను ప్రతిస్పందించనివ్వండి" అని మరొకరు వ్యాఖ్యానించారు.వెంటనే జొమాటో లిస్టింగ్‌లోంచి ఆ రెస్టారెంట్‌ను తొలగించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top