రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే ​కూడా ఆఫీస్‌ | Bengaluru based startup Matiks ignited a fiery debate on hustle culture | Sakshi
Sakshi News home page

రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే ​కూడా ఆఫీస్‌

Jul 8 2025 4:41 PM | Updated on Jul 8 2025 5:43 PM

Bengaluru based startup Matiks ignited a fiery debate on hustle culture

ఉద్యోగులు మెషీన్‌లా పనిచేయాలని కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు భావిస్తున్నాయి. అయితే తీరికలేకుండా నిర్ణీత పని గంటల కంటే ఎక్కువసేపు వర్క్‌ చేయించే కొన్ని కంపెనీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కంపెనీలో ఉద్యోగులు రోజుకు 12 గంటలు, వారానికి ఆరు రోజులు, చాలాసార్లు ఆదివారాల్లోనూ పనిచేస్తారని బహిరంగంగా చెప్పడం కార్పొరేట్‌ పని వాతావరణంపై ఆందోళనలు కలిగిస్తుంది.

మొబైల్ గేమింగ్ స్టార్టప్ మాటిక్స్‌ప్లే సహ వ్యవస్థాపకుడు మోహన్ కుమార్ తన ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ‘మాకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్‌ కార్యకలాపాలుంటాయి. వారానికి 6 రోజులపాటు కఠినమైన ఆఫీస్‌ టైమింగ్స్‌ ఉన్నాయి. అయినా మా టీమ్‌లో 10 కంటే ఎక్కువ మంది ఆదివారాల్లో కూడా పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ప్రజలు ఈ విధానాన్ని విమర్శిస్తారు. కానీ వాస్తవం ఏంటంటే భారత్‌లో ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారు చేయాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. జాబ్ మైండ్‌సెట్‌ నుంచి బిల్డ్‌ మైండ్‌సెట్‌ను పెంపొందించుకోవాలి’ అని చెప్పారు.

ఈ పోస్ట్‌పై ఆన్‌లైన్‌లో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది సంస్థ మొదటి నుంచి ఉత్పత్తిని నిర్మించే నిబద్ధతను ప్రశంసించారు. మరికొందరు బర్న్అవుట్, వర్క్‌-లైఫ్‌ సమతుల్యతపై ఆందోళన, పని దోపిడీ అని తెలిపారు. ఈ నేపథ్యంలో కుమార్ తన పాత పోస్టును డిలీట్ చేసి ‘బాయ్స్, కూల్, ఉదయం 10:00 గంటలకు ఎవరూ లోపలికి రారు. మేము ఆఫీసులో కలిసి పేకాట ఆడతాం. నెట్‌ఫ్లిక్స్‌ చూస్తాం. మేమందరం కెరియర్ మొదటి నుంచి నిర్మించుకుంటున్నాం. ఇక్కడ ఎవరూ కష్టంగా ఉద్యోగం చేయడం లేదు. సీనియర్లు, జూనియర్లు కలిసి ఒక ప్రాజెక్టులో పని చేస్తున్నాం. అది నూటికి నూరు శాతం ఫలితాలు ఇస్తుంది. కార్పొరేట్ కార్యాలయాల్లో మీరు ఊహించలేని ఒక రకమైన సరదా మా ఆఫీసులో ఉంది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం

హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కుమార్ మాట్లాడుతూ.. కంపెనీ తన ఉద్యోగులను సిబ్బందిగా చూడదని, సంస్థ మిషన్‌లో వ్యవస్థాపక సభ్యులుగా పరిగణిస్తుందని చెప్పారు. జీతభత్యాల కోసమో, మనుగడ కోసమో తాము పనిచేయడం లేదన్నారు. చాలామందికి ఈ మనస్తత్వం ఉండదు. నిజంగా కష్టపడేవారికి ఇది ఒక ఉద్యోగంలా అనిపించదని చెప్పారు. తమ కలను వెంటాడుతున్నట్టు తోస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement