బ్యాంక్‌లోన్‌ రిజెక్ట్‌ అయితే ఏం చేయాలంటే.. | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌లోన్‌ రిజెక్ట్‌ అయితే ఏం చేయాలంటే..

Published Tue, Jan 9 2024 3:02 PM

Banks Reject Loans Due To Various Reasons  - Sakshi

బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. అన్ని సందర్భాల్లోనూ రుణం దొరకండ అంత తేలికేమీ కాదు. కొందరికి ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం కష్టం అవుతుంది. అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకున్నప్పటికీ బ్యాంకులు రుణ దరఖాస్తును తిరస్కరిస్తోంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు రుణగ్రహీత ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

రుణ దరఖాస్తును తిరస్కరించేందుకు చాలా కారణాలుంటాయి. అంతకు ముందు తీసుకున్న రుణాల చెల్లింపు తీరు, ఆదాయాన్ని మించిన అప్పుల్లాంటివీ ఇందులో ఉంటాయి. రుణ దరఖాస్తు తిరస్కరించిన వెంటనే మళ్లీ కొత్తగా వేరే బ్యాంకులో దరఖాస్తు చేయకముందు చాలా విషయాలు సరిచేసుకోవాలి.

మీ దరఖాస్తును బ్యాంకు ఎందుకు తిరస్కరించిందో కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రుణదాతలు కచ్చితంగా దీన్ని తెలియజేస్తారు. క్రెడిట్‌ స్కోరు 700 పాయింట్ల లోపు ఉన్నప్పుడు రుణ దరఖాస్తును ఆమోదించడం కష్టం. తగినంత ఆదాయం లేకపోవడం, ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలు మీ ఆదాయంలో 50-60 శాతానికి చేరడం, వాయిదాలను ఆలస్యంగా చెల్లించడం, ఉద్యోగంలో సమస్యలు, తాకట్టు పెట్టిన ఆస్తులకు సంబంధించి చట్టపరమైన చర్యల వంటి వాటివల్లా దరఖాస్తు తిరస్కరించే ఆస్కారం ఉంది. మీ క్రెడిట్‌ నివేదికలో తప్పుడు వివరాలూ కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు.

వాయిదాలు చెల్లింపులో..

రుణ తిరస్కరణ ఎదురుకాకుండా చూసుకునేందుకు ఆరోగ్యకరమైన రుణ చరిత్రను నిర్వహించడం ఎంతో కీలకం. వాయిదాలను సకాలంలో చెల్లించాలి. 750కి మించి క్రెడిట్‌ స్కోరున్నప్పుడు రుణ దరఖాస్తును సులభంగా ఆమోదిస్తారు. తక్కువ స్కోరు వల్లే రుణం లభించలేదు అని తేలితే.. ముందుగా స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి. చిన్న మొత్తంలో ఉన్న అప్పులను పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీ క్రెడిట్‌ స్కోరు క్రమంగా పెరుగుతుంది. 

తప్పుడు వివరాలుంటే.. 

వ్యక్తిగత గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా, సంతకం, పాన్‌, ఆధార్‌ ఇలా పలు వివరాలను రుణ దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ రుణదాతల యాప్‌లోనే అప్‌లోడ్‌ చేయాల్సి వస్తుంది. వీటిలో ఏ చిన్న పొరపాటు గుర్తించినా, రుణ దరఖాస్తు ఆమోదం పొందదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలు సరిచూసుకోవాలి.

నిత్యం లోన్‌లు అడుగుతుంటే..

కొంతమంది అవసరం లేకపోయినా వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డుల కోసం బ్యాంకులను సంప్రదిస్తారు. ఇలా మీరు అడిగిన ప్రతిసారీ మీ క్రెడిట్‌ స్కోరు స్వల్పంగా తగ్గుతుంది. కాబట్టి, తక్కువ వ్యవధిలోనే బహుళ రుణ దరఖాస్తులు మీ క్రెడిట్‌ స్కోరును గణనీయంగా దెబ్బతీస్తాయి. మీ స్కోరును కాపాడుకునేందుకు సాధ్యమైనంత వరకూ తక్కువ దరఖాస్తులు చేయడం మేలు. అనేకసార్లు దరఖాస్తు చేస్తే.. మీరు అప్పుల మీదే ఆధారపడుతున్నారని బ్యాంకులు భావించే అవకాశం ఉంది.

తనిఖీలు చేసుకోండి..

క్రెడిట్‌ నివేదికలో తప్పులు దొర్లినప్పుడు వాటిని వెంటనే గుర్తించేలా ఉండాలి. కాబట్టి, క్రెడిట్‌ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.  కొన్ని క్రెడిట్‌ బ్యూరోలు నెలకోసారి వీటిని ఉచితంగానే అందిస్తాయి. మీ ఆర్థిక ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఇవి తోడ్పడతాయి. ఏదైనా పొరపాట్లు ఉంటే, వెంటనే వాటిని గుర్తించి, సరి చేసుకునేందుకు వీలవుతుంది. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు, అది పెరిగేందుకు కొంత సమయం పడుతుంది. రుణ వాయిదాలు, క్రెడిట్‌ కార్డు  బాకీల్లాంటివి సకాలంలో చెల్లించాలి. అప్పుడు మీపై బ్యాంకులకు విశ్వాసం పెరిగి, రుణ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలుంటాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement