
ముంబై: ఆర్థిక రంగానికి సంబంధించిన టెక్నాలజీలు శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో కొత్త సాంకేతిక సాధనాల గురించి బ్యాంకింగ్ పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ముకేశ్ జైన్ సూచించారు. తద్వారా ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలిగేలా పర్యవేక్షణ మెళకువలను మెరుగుపర్చుకోవాలని, రిస్క్ నిర్వహణ సామరŠాధ్యలను పటిష్టం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఆసియా–పసిఫిక్ దేశాల 25వ సీసెన్–ఎఫ్‌ఎస్‌ఐ సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైన్ ఈ విషయాలు తెలిపారు. ఇటీవల కొన్ని విదేశీ బ్యాంకులు విఫలమైన ఉదంతాలు బైటపడిన నేపథ్యంలో బ్యాంకింగ్ సూపర్‌వైజర్ల పని మరింత కఠినతరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. కొత్త సవాళ్లు ఎదురవుతుండటంతో వారు ఇటు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం, అటు నైతికంగా వ్యవహరించడం మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉందని జైన్ చెప్పారు.
వివేకవంతమైన నిబంధనలను అమలు చేయడం, సమర్ధమంతమైన రిస్కు ఆధారిత పర్యవేక్షణ విధానం పాటించడం, పారదర్శకతను ప్రోత్సహించడం, సకాలంలో జోక్యం చేసుకోవడం, స్వతంత్రత.. జవాబుదారీతనంతో వ్యవహరించడం ద్వారా దీన్ని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీజతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పలు రిస్కులు కూడా పొంచి ఉంటాయని జైన్ వివరించారు. కాబట్టి సాంకేతికతను ఉపయోగించుకోవడంలో బ్యాంకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.