
పేదలు, సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్కొక్కటిగా ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే విధించే చార్జీలను రద్దు చేస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ జాబితాలో చేరింది. ప్రామాణిక పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల తొలగింపు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మార్పు ప్రీమియం ఉత్పత్తులు మినహా అన్ని సాధారణ పొదుపు ఖాతాలకు వర్తిస్తుంది.

కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లు ఇటీవలే పొదుపు ఖతాలకు కనీస బ్యాలెన్స్ ఛార్జీలు తొలగించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అనుసరించింది. ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ ఆవశ్యకతలను ఎత్తివేస్తూ ఈ దిశగా చర్యలు తీసుకుంది.
మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై విధిస్తున్న జరిమానాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఈ మార్పు చోటు చేసుకుంది. చౌక కరెంట్, పొదుపు ఖాతాల డిపాజిట్ల వాటాలో తగ్గుదలను బ్యాంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశం దృష్టిని ఆకర్షించింది.