
హోమ్ లోన్ గ్రహీతలకు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా మరోసారి శుభవార్త చెప్పింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 7.45 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ఇది 7.50 శాతంగా ఉంది. అలాగే కొత్త రుణ గ్రహీతలకు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రెపో రేటును తగ్గించిన తరువాత గత జూన్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే గృహ రుణ రేట్లను 8.00 శాతం నుండి 7.50 శాతానికి తగ్గించింది. ఇప్పుడు వడ్డీ రేటును ఇంకాస్త తగ్గించడంతో హోమ్‌లోన్ కస్టమర్లకు మరింత ఉపశమనం కలగనుంది. ఈ తాజా తగ్గింపు గృహ యాజమాన్యం మరింత చౌకగా మారుతుందని, దేశంలోని గృహ రంగంలో డిమాండ్‌ను ఉత్తేజపరిచే ప్రభుత్వ విస్తృత ఆర్థిక లక్ష్యానికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.

జీరో ప్రాసెసింగ్ ఫీజు
గృహ రుణాలను మరింత చేరువ చేయడంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేసింది. ఇంతవరకూ ఈ బ్యాంక్ లోన్ మొత్తంలో అర శాతం వరకూ ప్రాసెసింగ్ రుసుముగా తీసుకొనేది. ఇది గరిష్టంగా రూ.15 వేల వరకూ ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం. కస్టమర్లు లోన్ కోసం బ్యాంక్ బ్రాంచిల్లోనే కాకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.