Bajaj Auto Expands Its Pune Manufacturing Plant For Electric Vehicles - Sakshi
Sakshi News home page

పుణేలో బజాజ్‌ ఆటో కొత్త ఈవీ ప్లాంటు

Published Thu, Dec 30 2021 8:58 AM

Bajaj Auto Expands Its Pune Manufacturing Plant For Electric Vehicles - Sakshi

ముంబై: ద్విచక్ర వాహన దేశీ దిగ్గజం బజాజ్‌ ఆటో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి పుణేలోని ఆక్రుడి వద్ద కొత్త ప్లాంటును నెలకొల్పనుంది. ఇందుకు రూ. 300 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్లాంటు నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలియజేసింది. వార్షికంగా 5 లక్షల వాహన తయారీ సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దేశ, విదేశీ మార్కెట్లలో వాహనాలను విక్రయించనున్నట్లు తెలియజేసింది. 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల ఈ ప్లాంటు నుంచి తొలి వాహనం 2022 జూన్‌కల్లా వెలువడవచ్చని వివరించింది. కంపెనీ గత సుప్రసిద్ధ బ్రాండ్‌ చేతక్‌ స్కూటర్‌ తయారీ ప్రాంతమిది.

తాజా ప్లాంటులో 800 మందికి ఉపాధిని కల్పిస్తున్నట్లు బజాజ్‌ ఆటో వెల్లడించింది. 2001లో పల్సర్‌ బ్రాండుతో బైకును ప్రవేశపెట్టి విజయవంతమైన విషయం విదితమే. ఒక ఐసీఈ ప్లాట్‌ఫామ్‌ను మినహాయిస్తే.. మిగిలిన ఆర్‌అండ్‌డీ ప్రస్తుతం భవిష్యత్‌కు తగిన ఈవీ సొల్యూషన్ల అభివృద్ధిపై దృష్టిపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. పట్టణ ప్రయాణాలలో తేలికపాటి ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండు కొనసాగుతుందన్న తమ విశ్వాసానికి అనుగుణంగా ప్రస్తుత కార్యకలాపాలు ప్రారంభమైనట్లు కంపెనీ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వివరించారు. కాగా.. తాజా ప్లాంటుకు మద్దతుగా ఆటో విడిభాగాల సరఫరాదారులు సైతం మరో రూ.250 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలియజేశారు. కొత్త ప్లాంటును ఆధునిక రోబోటిక్, ఆటోమేటెడ్‌ తయారీ వ్యవస్థలతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.  ఈవీ ప్లాంటు వార్తల నేపథ్యలో బజాజ్‌ ఆటో షేరు 
బీఎస్‌ఈలో దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 3,262 వద్ద ముగిసింది.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement