
ముంబై: వాణిజ్య వాహన రంగ దిగ్గజం అశోక్ లేలాండ్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 33 శాతంపైగా జంప్‌చేసి రూ. 1,246 కోట్లను తాకింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 934 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 13,542 కోట్ల నుంచి రూ. 14,696 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 12,037 కోట్ల నుంచి రూ. 13,097 కోట్లకు పెరిగాయి.
ఈ నెల(మే) 22న చెల్లించిన(రెండో) రూ. 4.25 డివిడెండ్‌ను తుది డివిడెండ్‌గా ప్రకటించింది. మరోవైపు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. దీంతో ప్రతీ షేరుకి మరో షేరుని ఉచితంగా జారీ చేయనుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం రూ. 2,696 కోట్ల నుంచి రూ. 3,383 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 45,703 కోట్ల నుంచి రూ. 48,535 కోట్లకు ఎగసింది.
వెరసి క్యూ4తోపాటు పూర్తి ఏడాదిలో రికార్డ్ ఆదాయం సాధించినట్లు కంపెనీ చైర్మన్ ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. గతేడాది మొత్తం వాణిజ్య వాహన విక్రయాలు 1,95,093 యూనిట్లను తాకాయి. కంపెనీ ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో షేను అగర్వాల్ పేర్కొన్నారు. 2025 మార్చికల్లా రూ. 4,242 కోట్ల నగదు నిల్వలున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.4 శాతం బలపడి రూ. 240 వద్ద ముగిసింది.