ఐఫోన్ల విక్రయాలు కొత్త రికార్డు | Sakshi
Sakshi News home page

ఐఫోన్ల విక్రయాలు కొత్త రికార్డు

Published Thu, Nov 2 2023 4:57 AM

Apple Shatters Records in India Stagnant Smartphone Market - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల విపణిలో యాపిల్‌ కొత్త రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై–సెపె్టంబర్‌ కాలంలో 25 లక్షల యూనిట్లకుపైగా ఐఫోన్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 34 శాతం అధికంగా సాధించడం విశేషం. ఒక త్రైమాసికంలో భారత్‌లో కంపెనీ ఖాతాలో ఇదే ఇప్పటి వరకు రికార్డు. ఖరీదైన మోడళ్లకు మార్కెట్‌ మళ్లుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

సెపె్టంబర్‌ త్రైమాసికంలో భారత్‌లో 17.2 శాతం వాటాతో శామ్‌సంగ్‌ తొలి స్థానంలో నిలిచింది. నాలుగు త్రైమాసికాలుగా శామ్‌సంగ్‌ అగ్రస్థానాన్ని  కొనసాగిస్తోందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్‌ బుధవారం వెల్లడించింది. ఏ, ఎం సిరీస్‌ ఫోన్లు ఇందుకు దోహదం చేసిందని తెలిపింది. ఇక 16.6 శాతం వాటాతో షావొమీ రెండవ స్థానం ఆక్రమించింది. రూ.30–45 వేల ధరల శ్రేణి విభాగంలో వన్‌ప్లస్‌ 29 శాతం వాటాతో సత్తా చాటుతోంది.  

ఫోల్డబుల్‌ మోడళ్లకు..
ప్రీమియం విభాగం, 5జీ లక్ష్యంగా కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. రూ.45,000 ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం మోడళ్లకు డిమాండ్‌ ప్రతి త్రైమాసికంలోనూ పెరుగుతూ వస్తోంది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో అల్ట్రా ప్రీమియం మోడళ్ల అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 44 శాతం దూసుకెళ్లాయి. సులభ వాయిదాలు, ఇతర ప్రోత్సాహకాలు, నూతన టెక్నాలజీవైపు కస్టమర్ల మొగ్గు ఇందుకు దోహదం చేశాయి.

ఫోల్డబుల్‌ మోడళ్లకు డిమాండ్‌ దూసుకెళ్తోంది. ఈ విభాగంలోకి కంపెనీలు క్రమంగా ప్రవేశిస్తున్నాయి. అన్ని బ్రాండ్ల అమ్మకాల్లో 5జీ స్మార్ట్‌ఫోన్ల వాటా ఏకంగా 53 శాతానికి ఎగబాకింది. 10–15 వేల ధరల శ్రేణిలో ఎక్కువ మోడళ్లను కంపెనీలు ప్రవేశపెట్టాయి. వీటిలో 5జీ మోడళ్ల వాటా ఏడాదిలో 7 నుంచి 35 శాతానికి చేరింది. ఆసక్తికర విషయం ఏమంటే 5జీ, అధిక ర్యామ్‌ (8జీబీ) వంటి కీలక ఫీచర్లు రూ.10,000లోపు సరసమైన స్మార్ట్‌ఫోన్లకు విస్తరించాయి.

Advertisement
Advertisement