Anushka Sharma: అనుష్క ప్రొడక్షన్‌ హౌజ్‌తో అమెజాన్‌-నెట్‌ఫ్లిక్స్‌ రూ. 400 కోట్ల డీల్‌

Anushka Sharma Banner Deal With Amazon Netflix For OTT Content - Sakshi

కరోనా మహమ్మారి జనాలను బలవంతంగా ఓటీటీ వైపు అడుగులు వేసేలా చేసింది. అయితే రానురాను థియేటర్‌ కన్నా ఇల్లే పదిలం అనే రీతిలో ఓటీటీ వ్యవహారం తయారైంది. కోట్ల మంది ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఓటీటీ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ తరుణంలో టాప్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్.. ఓ హీరోయిన్‌తో కుదుర్చున్న డీల్‌ గురించి జోరుగా చర్చ మొదలైంది. 

ప్రస్తుతం దేశంలో అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ మధ్య పోటాపోటీ నడుస్తోంది. కిందటి ఏడాది చివర్లో  అమెజాన్‌ ప్రైమ్‌ రేట్లకు పెంచేయగా.. అనూహ్యంగా రేట్లను తగ్గించి  సబ్‌స్క్రయిబర్లను పెంచుకునే ప్లాన్‌ వేసింది నెట్‌ఫ్లిక్స్‌.  ఈ తరుణంలో ఈ రెండు చేతులు కల్పడం.. ఒకే ప్రొడక్షన్‌హౌజ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ నిర్వహిస్తున్న ప్రొడక్షన్‌ హౌజ్‌ ‘క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్‌జ్‌’తో ఈ రెండు ఓటీటీ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల కోసం 54 మిలియన్‌ డాలర్లు(దాదాపు 400 కోట్ల రూపాయలు) ఒప్పందం చేసుకున్నాయివి. 

క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్‌జ్‌ బ్యానర్‌, లేద సహ సమర్పణతో రాబోయే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రాబోయే పద్దెనిమిది నెలల్లో ఈ రెండు ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా రిలీజ్‌ కానున్నాయి.  ఇదిలా ఉంటే క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్‌జ్‌ను అనుష్క శర్మ తన సోదరుడు కర్ణేష్‌ ఎస్‌శర్మతో కలిసి నెలకొల్పింది. ఈ సొంత బ్యానర్‌లో ‘ఎన్‌హెచ్‌10, ఫిలౌరీ, పరి, పాతాళ్‌ లోక్‌,  బుల్‌బుల్‌, మయి, ఖ్వాలా లాంటి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను నిర్మించింది అనుష్క శర్మ. వీటిల్లో కొన్నింటిలో ఆమె నటించగా.. కొన్ని అమెజాన్‌ ప్రైమ్‌ సిరీస్‌, నెట్‌ప్లిక్స్‌ ద్వారా నేరుగా విడుదలైనవి ఉన్నాయి.

క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్‌జ్‌ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ప్రతినిధి ధృవీకరించగా.. కర్ణేష్‌ శర్మ మాత్రం జాబితా సిద్ధమైన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. మరోవైపు అమెజాన్‌ మాత్రం ఈ ఒప్పందంపై తర్వాత స్పందిస్తామని పేర్కొంది. ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ ఉంటున్న నేపథ్యంలో ఇలా నేరుగా ప్రొడక్షన్‌ హౌజ్‌లతో.. ఓటీటీ కంపెనీలు ఒప్పందాల్ని కుదర్చుకుంటున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top