సీన్‌ రివర్స్‌, ‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు!

Angry Microsoft Employees Slams Ceo Satya Nadella For Freezing Salary Hikes - Sakshi

ఆర్థిక మాంద్యం భయాలు మొదలైనప్పటి నుంచి ఐటీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ గణనీయమైన లాభాల్ని సాధించింది. స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీ స్టాక్స్‌ సరికొత్తగా ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఫలితంగా కంపెనీ విలువ 2.5 ట్రిలియన్ డాలర్ల వద్దకు చేరుకుంది. కానీ ఉద్యోగులే జీతాలు పెంచడం లేదని సంస్థపై, సంస్థ సీఈవో సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సాధించిన ఫలితాలపై సత్య నాదెళ్ల ఉద్యోగులకు ఇంటర్నల్‌ మెసేజ్‌ పంపించారు. అందులో ఈ ఏడాదిలో ఉద్యోగుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. సంస్థ సాధించిన ఫలితాలకు ఉద్యోగుల వినూత్నం, సృజనాత్మకత వల్లే సాధ్యమైందని కొనియాడారు. క్లయింట్లను, భాగస్వాములను సైతం అభినందనలతో ముంచెత్తారు. వచ్చే ఏడాది సైతం మెరుగైన ఫలితాలు సాధించేలా కలిసి పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్ధేశించుకున్న లక్ష్యాల్ని అధిగమించేలా అందరూ బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. 

థ్యాంక్యూ నోట్‌పై అసహనం
సత్యనాదెళ్ల పంపిన ఈ ఇంటర్నల్‌ మెసేజ్‌ను 2లక్షల మందికి పైగా వీక్షించే అవకాశం ఉంది. అయితే, సీఈవో తమకి అభినందనలు తెలపడంపై 130కి మంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించారు. మరికొంత మంది సీఈవో థ్యూంక్యూ నోట్‌పై అసహనం వ్యక్తం చేశారు. 

కృతజ్ఞతలు తెలపడం అంటే ఇలాగేనా
ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపడం అంటే జీతాలు పెంచకుండా ఉండటం కాదని ఓ ఉద్యోగి అంటుంటే..సంస్థ గడించిన లాభాల గురించి మాట్లాడుతూ.. జీతాలు పెంచకుండా అడ్డుకున్న సీనియర్‌ స్థాయి ఉద్యోగులపై సదరు ఉద్యోగి విమర్శలు గుప్పించారు. కంపెనీ, ఉన్నతస్థాయి ఉద్యోగులు రికార్డ్‌ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నప్పుడు ఉద్యోగులు మాత్రం వేతనాల కోతను ఎదుర్కొంటున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. ఇది సరికాదు, వేరే మార్గం లేదా? అని ప్రశ్నించారు.  

సంస్థను నమ‍్ముకుంటే మిగిలేది ఇదే..
పెరగకుండా స్తబ్దుగా ఉన్న వేతనాల గురించి ప్రస్తావిస్తూ మండిపోతున్న ధరలు.. పెరిగిపోతున్న ఖర్చులతో అల్లాడుతుంటే సంస్థ భారీ లాభాల్ని మూటగట్టుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంపెనీ పట్ల అంకితభావంతో ఉన్నప్పటికీ తమకు పెరగాల్సి జీతాలు పెరగలేదని అన్నారు. ‘రికార్డు లాభాలు ఎక్కడ నుండి వస్తాయని   ఆశ్చర్యపోతున్నాను? ఇక్కడ (ఆఫీస్‌లో) అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి కష్టపడి పనిచేసినందుకు నాకు ఎలాంటి ప్రతిఫలం దక్కలేదని వాపోయాడు మరో ఉద్యోగి.  

జాబ్‌కు రిజైన్‌ చేస్తాం..
సత్యనాదెళ్ల పంపిన థ్యాంక్యూ మెసేజ్‌పై ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేయడంపై మైక్రోసాఫ్ట్‌ యాజమాన్యం సందిగ్ధంలో పడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఉద్యోగుల మధ్య జరిగిన ఇంటర్నల్‌ పోల్‌ సంభాషణల్లో ఎక్కువ మంది..తాము కోరుకున్న ఉద్యోగం దొరికితే..మైక్రోసాఫ్ట్‌ను వదిలివెళ్లేందుకు సిద్ధపడ్డట్లు నివేదికలు హైలెట్‌ చేశాయి. అయితే, ఉద్యోగుల అసంతృప్తి, రిజైన్‌ల అంశంపై మైక్రోసాఫ్ట్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.

చదవండి👉 ‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్‌ సీఈవోని చేసింది’  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top