
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రూ.3.59 లక్షల కోట్ల చొప్పున నికర విలువతో ఇండియాలో సంపద సృష్టికర్తల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. క్రిసిల్ సహకారంతో 360 వన్ వెల్త్ దేశంలోని వివిధ రంగాల్లో సేవలిందిస్తున్న అత్యంత సంపన్నుల జాబితాను తయారు చేసింది.
ఈ సమగ్ర జాబితాలో కనీసం రూ.500 కోట్ల నికర విలువ కలిగిన 2,013 మంది ఉన్నారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, వారసులు, పెట్టుబడిదారులు, వృత్తి నిపుణులు చోటు సంపాదించుకున్నారు. వీరి సంపద దాదాపు రూ.100 లక్షల కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. 161 మంది వ్యక్తులు రూ.10,000 కోట్లకు మించి, 169 మంది వ్యక్తులు రూ.5,000-రూ.10,000 కోట్ల మధ్య సంపద కలిగి ఉన్నారని ఈ అధ్యయనం తెలిపింది.
ఇదీ చదవండి: ఐదు రెట్లు పెరిగిన ఉత్పాదకత
మహిళా పారిశ్రామికవేత్తల్లో ఇషా అంబానీ రూ.3.58 లక్షల కోట్లతో అత్యంత ధనిక వ్యాపార యజమానిగా నిలిచారు. వ్యాపారాలను స్థాపించిన లేదా అధిక విలువ జోడించేందుకు గణనీయమైన పాత్ర పోషించిన 72 మంది మహిళా నాయకులను కూడా ఈ నివేదిక గుర్తించింది. భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. మొత్తం ప్రమోటర్ సంపదలో రిలయన్స్, టాటా, అదానీ గ్రూపుల వాటా 24 శాతంగా ఉంది. దేశంలోని టాప్ 50 వ్యాపార సంస్థలు 360 ఐటీ వెల్త్ క్రియేటర్స్ జాబితాలో ఉన్న కంపెనీల మొత్తం సంపదలో 59 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్ మాత్రమే ఇందులో 12% వాటాను కలిగి ఉన్నాయి.
అంబానీల ప్రభావం
టెలికాం, రిటైల్, ఎనర్జీ, డిజిటల్ సర్వీసెస్.. వంటి కీలక రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సుస్థిర నాయకత్వాన్ని అంబానీ కుటుంబం కొనసాగిస్తోంది. భారతదేశ డిజిటల్ విప్లవానికి జియో నాయకత్వం వహించడం, రిలయన్స్ రిటైల్ దూకుడుగా విస్తరించడంతో అంబానీ కుటుంబం ఆర్థిక సామ్రాజ్యం రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.