ఏఐ రేసులో భారత్‌ బేజారు | After Taiwan and South Korea overtakes India to become worlds sixth largest stock | Sakshi
Sakshi News home page

ఏఐ రేసులో భారత్‌ బేజారు

Jun 3 2026 4:16 AM | Updated on Jun 3 2026 4:16 AM

After Taiwan and South Korea overtakes India to become worlds sixth largest stock

షేర్ల విలువల్లో గ్లోబల్‌ దిగ్గజాల దూకుడు 

ఎన్‌విడియా, శామ్‌సంగ్, టీఎస్‌ఎంసీ స్పీడ్‌ 

దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో డీలా 

మార్కెట్‌ విలువలో భారత్‌ను దాటిన తైవాన్‌ 

ఇదేబాటలో దూసుకొస్తున్న దక్షిణ కొరియా

కొద్ది నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా వినిపిస్తున్న పదం ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)! బుడిబుడి అడుగులేస్తూ విశ్వమంతటా వ్యాపించిన వామనుడిలా అన్ని రంగాలలోనూ ఏఐ విస్తరిస్తోంది. తొలుత సాఫ్ట్‌వేర్‌ రంగంలో విప్లవంగా అభివర్ణించిన ఏఐ ప్రస్తుతం అడుగుపెట్టని పరిశ్రమలేదంటే అతిశయోక్తికాదు!! అయితే ఏఐలో ముందడుగు వేస్తూ ఆవిష్కరణలకు తెరతీస్తున్న కంపెనీలు, దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్నాయ్‌.. దీంతో అటు పూర్తిగా ఏఐ లేదా ఇటు విభిన్న ఆవిష్కరణలలో బలమైన వృద్ధిని అందుకోలేక సతమతమవుతున్న భారత్‌ను మార్కెట్‌ విలువలో తైవాన్‌ అధిగమించింది. ఇదే సమయంలో మరోపక్క దక్షిణ కొరియా దూసుకొస్తోంది. వివరాలు చూద్దాం.. 
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఏఐ అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలోనూ ప్రకంపనలు రేపుతోంది. ఏఐపై భారీగా ఇన్వెస్ట్‌ చేసిన యూఎస్‌ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆశించినస్థాయిలో లబ్ది పొందలేదన్న అంచనాలు షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ బాటలో దేశీయంగానూ ఐటీ సేవల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్, విప్రో తదితర కౌంటర్లలోనూ కొద్ది రోజులుగా భారీ అమ్మకాలకు తెరలేచింది.

మరోపక్క ఏఐ బూమ్‌తో భారీగా లబ్ధి పొందుతున్న యూఎస్‌ చిప్‌ దిగ్గజం ఎన్‌విడియా కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొనడంతో షేరు రోజుకో గరిష్టాన్ని తాకుతోంది. ఫలితంగా స్టాక్‌ మార్కెట్లో ఎన్‌విడియా కంపెనీ మార్కెట్‌ విలువ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్లను అధిగమించింది! వెరసి దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీ బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువను మించిపోయింది!! 

నెక్‌ టు నెక్‌ 
ఏఐ సానుకూలతలతో దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజాలు శామ్‌సంగ్‌ ఎల్రక్టానిక్స్, ఎస్‌కే హైనిక్స్‌ షేర్లు సైతం ర్యాలీ చేస్తున్నాయి. ఫలితంగా ఆ దేశ స్టాక్‌ మార్కెట్‌ విలువ సైతం వేగంగా బలపడుతోంది. 2026లో ఇప్పటివరకూ 70 శాతం జంప్‌చేయడంతో 4.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దీంతో భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ విలువకు (ప్రస్తుతం 4.91 లక్షల కోట్ల డాలర్ల) చేరువైంది. మరోపక్క ఏఐ బూమ్‌ తైవాన్‌కు బాగా కలసి వస్తోంది.

2026లో 50 శాతం వృద్ధి చెందడంతో తైవాన్‌ మార్కెట్‌ విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందుకు ప్రధానంగా తైవాన్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ(టీఎస్‌ఎంసీ) షేరు 50 శాతం పురోగమించడం సహకరించింది. తద్వారా మార్కెట్‌ విలువ ర్యాంకింగ్‌లో భారత్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది! 

దేశీయంగా నేలచూపు 
ఈ కేలండర్‌ ఏడాదిలో ఇప్పటివరకూ ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో మార్కెట్‌ విలువలో 28–24 శాతం మధ్య కోతపడింది. ఇదే సమయంలో ప్రధాన ఇండెక్సులు 12 శాతం క్షీణించగా.. ఐటీ ఇండెక్స్‌ 25 శాతం పతనమైంది. ఐటీ మిడ్‌క్యాప్స్‌లో కోఫోర్జ్, ఎల్‌టీఎం, పెర్సిస్టెంట్, ఎంఫసిస్‌ 30–22 శాతం మధ్య తిరోగమించాయి. ఇందుకు హెచ్‌1బీ వీసా ఫీజు భారీ పెంపు, క్లయింట్ల వ్యయాలు తగ్గడం, డీల్స్‌లో ఆలస్యం ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల వీటన్నిటికిమించి ఏఐ మరింత ఆందోళనలకు కారణమవుతోంది. వెరసి ఈ ఏడాది మొత్తం లిస్టెడ్‌ ఐటీ షేర్ల మార్కెట్‌ విలువలో రూ. 7,67,000 కోట్లు ఆవిరైనట్లు ఒక నివేదిక తెలియజేసింది.

భారత్‌ సేఫ్‌
దేశీ క్యాపిటల్‌ మార్కెట్ల మొత్తం విలువలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ వాటా 4 శాతమే. ఇక ఐటీ పరిశ్రమ విలువ సుమారు 281 బిలియన్‌ డాలర్లుకాగా.. మొత్తం మార్కెట్‌ క్యాప్‌లో వాటా 5–7 శాతమే. అయితే దక్షిణ కొరియా మార్కెట్‌ విలువలో శామ్‌సంగ్, ఎస్‌కే హైనిక్స్‌ 50 శాతం వాటా ఆక్రమిస్తుండగా.. తైవాన్‌ మార్కెట్‌ విలువలో టీఎస్‌ఎంసీ వాటానే 40 శాతం. దీంతో ఆయా దిగ్గజాల షేర్ల విలువ మొత్తం మార్కెట్‌ విలువను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి భారత్‌పై ఏ ఒక్క రంగం లేదా కంపెనీ అతిగా ప్రభావం చూపే వీలులేకపోవడం సానుకూల అంశమని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement