Afghanistan: పైసల్లేవ్‌! బన్ను కూడా దొరకని పరిస్థితి తప్పదా? తాలిబన్ల ముందు మార్గాలేంటంటే..

Afghan Economy Foreign Aid Gone Talibans Look For Alternatives - Sakshi

భద్రతపై ఎన్ని హామీలు ఇస్తున్న తాలిబన్లపై అఫ్గన్‌లకు నమ్మకం కలగడం లేదు. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలని, అధికారులు ఆఫీసులకు రావాలని తాలిబన్లు భరోసా ఇస్తున్నా.. స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా భద్రతా దళాల తరలింపు ప్రక్రియ ముగిశాక.. అఫ్గనిస్తాన్‌ పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే పరిస్థితి నెలకొనవచ్చని నిపుణులు అప్పుడే ఓ అంచనాకి వచ్చారు. 

తుపాకుల పహారా నడుమే అరకోరగా తెరుచుకుంటున్న షాపింగ్​సముదాయాలు. బ్యాంకులు బంద్‌.. ఏటీఎంలలో నిండుకున్న డబ్బులు. చాలావరకు పెట్రోల్‌ బంక్‌లకు నో స్టాక్‌ బోర్డులు. మరోవైపు మందుల కొరతతో అఫ్గన్‌లు అల్లలాడిపోతున్నారు. ఈ తరుణంలో తాలిబన్ల కంటపడకుండా బిస్కెట్‌ ప్యాకెట్ల నుంచి మొదలు.. ప్రతీ నిత్యావసరాలను అడ్డగోలు రేట్లకు అమ్మకుంటున్నారు అక్కడి వ్యాపారులు. గత పదిరోజులుగా అఫ్గనిస్తాన్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలు ఇవే.
 

ఆకలి కేకలు తప్పవా?
సెప్టెంబర్‌ నుంచి అఫ్గనిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం మొదలుకావొచ్చని యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ పుడ్‌ ప్రోగ్రాం(WFP) అంచనా వేస్తోంది. బ్రెడ్డు కూడా దొరకని పరిస్థితుల్లో సుమారు కోటిన్నర మంది ఆకలి కోరల్లో కొట్టుమిట్టాడతారని, భారీ ఎత్తున్న సహాయకార్యక్రమాల అవసరం పడొచ్చని యూఎన్‌ విభాగం అభిప్రాయపడింది. యూఎన్‌ అంచనా ప్రకారం.. ప్రపంచంలో అంతర్జాతీయ సమాజం నుంచి మూడో అతిపెద్ద సహాయక కార్యక్రమం అఫ్గనిస్తాన్​ గడ్డపై నిర్వహించాల్సి రావొచ్చని చెబుతోంది.

డబ్ల్యూహెచ్‌వో నిస్సహాయత!
రెడ్‌క్రాస్‌, డబ్ల్యూహెచ్‌వోలతో పాటు మరికొన్ని ఎన్జీవోలు అఫ్గనిస్తాన్‌లో గత ఇరవై ఏళ్లుగా సేవలు అందిస్తున్నాయి. నెలన్నర పరిస్థితుల తర్వాత ఈ వారం మొదట్లో సుమారు 500 టన్నుల మందులను దించేందుకు ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు డబ్ల్యూహెచ్‌వో రీజియనల్‌ డైరెక్టర్‌ తెలిపారు. దీనికితోడు కరోనా కేసులు పెరుగుతూ.. నాలుగో వేవ్‌ దిశగా వెళ్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది.  అయితే కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులు క్లియర్‌ అయితే గనుక.. ఈ సమస్యకు కొంత పరిష్కారం అవ్వొచ్చని భావిస్తున్నారు.
  

నిధులు నిల్​
ప్రభుత్వ నిధుల సంగతి!. 2001లో తాలిబన్ల కట్టడి నాటికి అఫ్గన్​ఆర్థిక వ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉండేది. అమెరికా-నాటో దళాల మోహరింపు నడుమ తర్వాతి ఇరవై ఏళ్లలో విదేశీ నిధులతోనే అఫ్గన్​ ఆర్థిక వ్యవస్థ నడిచింది. ఒకానొక టైంలో అసలు అఫ్గన్‌ ప్రభుత్వం 70-80 శాతం అంతర్జాతీయ దాతల సహకారం ద్వారా నడిచింది. అందులో యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అందించే సాయం ఎక్కువగా ఉండేది.  కానీ, ఇప్పుడు ఆ సాయం ఆగిపోయింది. బ్యాంక్‌ అకౌంట్లన్నీ ఫ్రీజ్​ అయ్యాయి. బయటి దేశాల సాయం ఇప్పుడప్పుడే అందే ఛాన్స్​ లేదు.  ప్రభుత్వ ఏర్పాటునకు తాలిబన్లకు ఇంకా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. పొరుగు లేదంటే మిత్ర దేశాల సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా.. అందుకు ఇప్పట్లో తగ్గ పరిస్థితులు కనిపించడం లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో.. అఫ్గన్​బండిని లాగడం తాలిబన్లకు కత్తిమీద సాము లాంటిదే.         చదవండి: భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: తాలిబన్లు

వనరులే దిక్కింకా!
తాలిబన్ల ముందున్న మొదటి పని.. ధరలను అదుపు చేస్తూనే ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారకుండా చూసుకోవడం. ఉత్పత్తులను దేశంలోకి అనుమతించేలా తక్షణ చర్యలు చేపట్టడం. ఇదంతా రాజకీయ, పాలనాపరమైన, అంతర్గత సంక్షోభ వ్యవహారాలతో సంబంధం లేకుండా జరగాలి. అలాగే వనరులను ప్రధానంగా ఉపయోగించుకుని సంక్షోభం నుంచి ఎంతో కొంత అధిగమించే ప్రయత్నం చేయాలి. అఫ్గన్​ నేల ఎంతో విలువైన రాశులకు నిలయం. కాపర్‌, గోల్డ్‌, ఆయిల్‌, సహజ వాయువులు, యురేనియం, బాక్సైట్‌, కోల్‌, ఐరన్‌ ఓరె, లిథియం, క్రోమియం, లెడ్‌, జింక్‌, జెమ్‌స్టోన్స్‌, సల్ఫర్‌, జిప్సం, మార్బుల్‌.. తదితరాలు దొరకుతాయి. 1.4 మిలియన్‌ టన్నుల అరుదైన ఖనిజ సంపద ఇక్కడ నెలవై ఉంది. దీనిని మిలిటరీ ఎక్విప్‌మెంట్‌, ఎలక్రా‍్టనిక్‌ గూడ్స్ తదితరాల కోసం వేరేదేశాలకు తరలించి భారీగా నిధులు సమకూర్చుకోవచ్చు. తద్వారా కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది. కరోనా టైంలోనే అఫ్గన్‌ ఖనిజ సంపద మీద చాలా దేశాలు ఆసక్తి చూపించాయి. ప్రత్యేకించి చైనా.. అఫ్గన్‌లో భారీ పెట్టుబడుల ద్వారా ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే తాలిబన్ల దురాక్రమణతో ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్లాలి. ఇప్పుడు తాలిబన్లతో చర్చలకు సైతం సిద్ధపడుతున్న చైనాను.. భారీ పెట్టుబడులకు ఆహ్వానించాలి.  చదవండి: ఐసిస్‌ కే ఎవరు? భారత్‌కు వాళ్లతో ముప్పా?


ఒకప్పుడు తాలిబన్లకు ఓపియం(నల్ల మందు) ప్రధాన ఆదాయ వనరుగా ఉపయోగించుకున్నారు. ఓపియం సాగు, పన్నులు, తరలింపు ద్వారా విపరీతమైన నిధులు సమకూర్చుకున్నారు. కానీ, ఇప్పుడు దానికి దూరంగా ఉంటామని ప్రకటించుకున్నారు. అయితే ఓపియం సాగు ద్వారా 2019లో లక్షా ఇరవై వేల ఉద్యోగాలు లభించాయి. ట్యాక్సుల ద్వారా నిధులొచ్చాయి. అలాంటి దానిపై నిషేధం.. అఫ్గన్‌ను ఆర్థికంగా కోలుకునే అవకాశం నుంచి దూరం చేస్తుందని కొందరు అమెరికన్‌ మేధావులు విశ్లేషిస్తున్నారు.

కానీ, ఓపియం వర్తకం ద్వారా అంతర్గత, అంతర్జాతీయ సమాజం నుంచి శత్రువుల్ని తయారు చేసుకోవడం తమకు ఇష్టం లేదని ప్రకటించుకుంది తాలిబన్‌. అంతేకాదు నల్ల మందులో అమెరికాలో 2019లో యాభై వేల మరణాలు సంభవించాయనే విషయాన్ని ప్రధానంగా వినిపిస్తూ.. బ్యాన్‌ ఆదేశాలకు సిద్ధపడింది తాలిబన్‌ సంస్థ. వీటికి బదులుగా వనరులతో పాటు పశుపోషణ, డ్రైడ్‌ ఫ్రూట్స్‌ వ్యాపారాల్ని సమర్థవంతంగా నడిపించుకోవడం, బయటి ఉత్పత్తులకు అనుమతించడం ద్వారా ఊబి మధ్య నుంచి బయటపడొచ్చు.

- సాక్షి వెబ్‌ డెస్క్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top