Kabul Airport Attack: ఐసిస్‌–కె అంటే తెలుసా?

ISIS-K claims responsibility for explosion at Kabul airport - Sakshi

కాబూల్‌ విమానాశ్రయాన్ని రక్తమోడించిన ఐసిస్‌–కె సంస్థ అఫ్గాన్‌లో తన పట్టు మరింత బిగించాలని చూస్తోంది. అటు అమెరికా, ఇటు తాలిబన్లకు గట్టి హెచ్చరికలు పంపడానికే ఈ దారుణానికి ఒడిగట్టింది. తాలిబన్లతో ఇప్పటికే ఆధిపత్య పోరాటంలో ఉన్న ఈ ఉగ్ర సంస్థ ఈ పేలుళ్లతో అమెరికాకి పక్కలో బల్లెంలా మారింది. అసలు ఏమిటి ఉగ్ర సంస్థ? ఎలా అరాచకాలు చేస్తోంది?  

ఏమిటీ ఐసిస్‌–కె?
ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాద సంస్థలో కార్యకలాపాలు సాగిస్తున్న కరడుగట్టిన భావజాలం ఉన్న ఉగ్రవాదులు కొందరు 2014లో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. పాకిస్తానీ తాలిబన్‌ ఫైటర్లు మొదట్లో ఈ గ్రూపులో చేరారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లో తొలిసారిగా వీరి కదలికలు కనిపించాయి. ప్రస్తుత అఫ్గానిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, టర్క్‌మెనిస్తాన్‌లో భాగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఖొరాసన్‌ అని పిలిచేవారు.  వీరి ప్రధాన కార్యాలయం ఈ ప్రాంతంలోనే ఉంది. పాకిస్తాన్‌కి మాదకద్రవ్యాలు, అక్రమంగా మనుషుల్ని రవాణా చేయాలంటే ఈ మార్గంలోనే వెళ్లాలి. ఈ  ప్రాంతానికి గుర్తుగా వీరిని ఐసిస్‌–కె లేదంటే ఐఎస్‌–కె అని పిలుస్తారు.  మధ్య, దక్షిణాసియాల్లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమే వీరి లక్ష్యం.  ఇక్కడ చదవండి: ఐసిస్‌–కెతో భారత్‌కూ ముప్పు!

ఎన్నో అరాచకాలు  
తాలిబన్లు కేవలం అఫ్గానిస్తాన్‌కు పరిమితమైపోతే ఐసిస్‌–కె ప్రపంచవ్యాప్తంగా ముస్లిమేతరులపై జీహాద్‌కు పిలుపునిచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన సంస్థ సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అంచనాల ప్రకారం ఐసిస్‌–కెలో 2017–18 సంవత్సరంలోనే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లో సాధారణ పౌరులు లక్ష్యంగా 100కి పైగా దాడులు చేసింది. ఇక అమెరికా–అఫ్గాన్, పాకిస్తానీ బలగాలపై 250 దాడులు జరిపింది. 2020లో కాబూల్‌ విమానాశ్రయం, , కాబూల్‌ యూనివర్సిటీపై దాడులు, అధ్యక్ష భవనంపై రాకెట్లతో దాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్టుగా అనుమానాలున్నాయి. ఇవే కాకుండా అమ్మాయిలు చదువుకునే పాఠశాలలపై దాడులకు దిగడం, ఆస్పత్రుల్లో మెటర్నటీ వార్డులపై దాడులకు పాల్పడి గర్భిణిలను, నర్సులను నిర్దాక్షిణ్యంగా కాల్చేయడం చేశారు. షియా ముస్లింలపై అధికంగా దాడులకు చేస్తున్నారు.  చదవండి:Donald Trump: దేశం శోకంలో మునిగిపోయింది.. ట్రంప్‌ భావోద్వేగం

ఇంకా ఎలాంటి ప్రమాదాలున్నాయ్‌?
తాలిబన్ల క్రూరత్వమే భరించలేనిదిగా ఉంటే ఐసిస్‌–కె మరింత కర్కశంగా వ్యవహరిస్తోంది. షరియా చట్టాలను పూర్తిగా మార్చేసి తాము సొంతంగా రూపొందించిన నియమ నిబంధనలను అఫ్గాన్‌ ప్రజలపై రుద్దాలని ఈ సంస్థ చూస్తోంది. తాలిబన్లు కఠినంగా వ్యవహరించడం లేదన్నది వీరి భావన. తాలిబన్లు, ఐసిస్‌–కె మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరాటం నడుస్తూనే ఉంది. అమెరికాతో తాలిబన్లు శాంతి చర్చలకు వెళ్లడం కూడా ఈ సంస్థకి అసలు ఇష్టం లేదు. శాంతి ఒప్పందాల వల్ల జీహాద్‌ లక్ష్యాలను చేరుకోలేమని వీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇప్పుడీ దాడులతో అమెరికాకు కూడా పక్కలో బల్లెంలా మారింది.  

హక్కానీ నెట్‌వర్క్‌ అండ   
తాలిబన్లతో వీరికి ఏ మాత్రం సరిపడదు కానీ తాలిబన్లకు అత్యంత సన్నిహితంగా మెలిగే హక్కానీ నెట్‌వర్క్‌తో సత్సంబంధాలున్నాయి.  ఐసిస్‌–కె,  హక్కానీ నెట్‌వర్క్, పాక్‌ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఇతర సంస్థలు ఉమ్మడిగా పన్నాగాలు పన్ని ఎన్నో దాడులకు దిగారు. ఆగస్టు 15న అఫ్గాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత జైళ్లలో ఉన్న వారిని చాలా మందిని విడుదల చేశారు. వారిలో ఐఎస్, అల్‌ ఖాయిదా ఉగ్రవాదులు ఐసిస్‌–కెతో చేతులు కలిపారు. హక్కానీ నెట్‌వర్క్‌ సభ్యులే ఈ సంస్థకి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారన్న అనుమానాలున్నాయి.  

బలమెంత?
2014లో  ప్రారంభమైన ఈ సంస్థ 2016 నాటికి అత్యంత శక్తిమంతంగా ఎదిగింది. ఆ సమయంలో ఈ సంస్థలో 3 వేల నుంచి 8,500 మంది వరకు ఉగ్రవాదులు ఉండేవారు. కానీ అమెరికా, అఫ్గాన్‌ బలగాలతో పాటు తాలిబన్లు జరిపిన దాడుల్లో చాలా మంది మృత్యువాత పడ్డారు. 2019 నాటికి ఈ సంస్థలో సభ్యుల సంఖ్య 2,000–4,000కి పడిపోయింది.  మన దేశంలోని కేరళ  యువకులు 100 మందిపై ఈ సంస్థ వల వేసి లాగేసుకుంది.  గెరిల్లా పోరాటంలో ఈ సంస్థ ఉగ్రవాదులకి  అత్యంత నైపుణ్యం ఉంది. పలుమార్లు ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ సంస్థ ఏర్పడినప్పుడు పాకిస్తానీ తాలిబన్‌ హఫీజ్‌ సయీద్‌ ఖాన్‌ ఈ సంస్థకు చీఫ్‌గా వ్యవహరించాడు. అతనికి డిప్యూటీగా ఉన్న అధుల్‌ రాఫ్‌ అలీజా అమెరికా చేసిన దాడుల్లో హతమయ్యారు.  ప్రస్తుతం షహాబ్‌ అల్‌ముజీర్‌ ఈ సంస్థకి చీఫ్‌గా ఉన్నాడు. అతను సిరియాకి చెందినవాడని భావిస్తున్నారు. 

– నేషనల్‌ డెస్క్, సాక్షి  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top