Donald Trump: దేశం శోకంలో మునిగిపోయింది.. ట్రంప్‌ భావోద్వేగం

Kabul Attacks: Donald Trump Says Would Not Happened If He President - Sakshi

వాషింగ్టన్‌: తాను ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే కాబూల్‌ పేలుళ్ల ఘటన జరిగి ఉండేది కాదని మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తను పదవిలో ఉండి ఉంటే ఈ శోకం సంభవించేది కాదని పేర్కొన్నారు. తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వేలాది మంది దేశాన్ని వీడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులు జరిగాయి.

ఈ ఘటనలో 100 మందికిపైగా మృతి చెందగా.. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై స్పందించిన డొనాల్డ్‌ ట్రంప్‌ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘ ధైర్య సాహసాలు ప్రదర్శించి సేవానిరతితో పని చేస్తూ అఫ్గనిస్తాన్‌ పేలుళ్ల దాడిలో అసువులు బాసిన అమెరికా సైనికులను గుర్తు చేసుకుంటూ జాతి నివాళులు అర్పిస్తోంది. శోకంలో మునిగిపోయింది.

కర్తవ్య నిర్వహణలో భాగంగా మన సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. నేను గనుక మీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇంతటి విషాదం ఎన్నడూ చోటుచేసుకునేది కాదు. ఎప్పటికీ ఇలా జరిగేది కాదు. దేశం కోసం, ఇతర దేశాల పౌరులను కాపాడే క్రమంలో ప్రాణలను పణంగా పెట్టిన అమెరికా హీరోల త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుందాం’’ అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. 

కాగా రెండు దశాబ్దాలుగా అఫ్గనిస్తాన్‌లో మోహరించిన అమెరికా సేనలను... ట్రంప్‌ హయాంలో తాలిబన్లతో కుదిరిన శాంతి ఒప్పందం ద్వారా పలు దఫాలుగా ఉపసంహరించకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రమంగా అన్ని ప్రావిన్సులపై పట్టు సాధించిన తాలిబన్లు.. అఫ్గన్‌ సైన్యాన్ని ఓడించి దేశాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో.. అమెరికా చరిత్రలో ఇదో ఘోర ఓటమి అంటూ ట్రంప్‌.. బైడెన్‌ ప్రభుత్వ పనితీరును ఎద్దేవా చేశారు.

చదవండి: Kabul Airport Attack: వేట తప్పదన్న బైడెన్‌.. దాడిని ఖండించిన తాలిబన్లు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top