
వచ్చే మూడేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు
రూ.20 లక్షల కోట్లకు మార్ట్‌గేజ్ రుణాలు
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడి
ముంబై: అందుబాటు ధరల ఇళ్ల రుణాలు వచ్చే మూడేళ్లలో గణనీయంగా పెరగనున్నాయి. అఫర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఏహెచ్‌ఎఫ్‌సీ) నిర్వహణలోని ఆస్తులు ప్రస్తుతం రూ.1.4 లక్షల కోట్లుగా ఉంటే, మూడేళ్లలో రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీల మార్ట్‌గేజ్ రుణాలు (ఇల్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి) 2025 మార్చి నాటికి రూ.13 లక్షల కోట్లుగా ఉంటే, 2028 మార్చి నాటికి రూ.20 లక్షల కోట్లకు పెరుగుతాయని తెలిపింది.
అన్‌సెక్యూర్డ్ రుణాల్లో సమస్యలు నెలకొనడంతో ప్రత్యామ్నాయ రుణాల మంజూరు పరంగా నియంత్రణలు నెలకొన్నట్టు పేర్కొంది. దీంతో రిటైల్ మోర్ట్‌గేజ్ రుణాలను బలమైన వృద్ధి నడిపించనున్నట్టు ఇక్రా ఫైనాన్షియల్ రంగ రేటింగ్స్ కో గ్రూప్ హెడ్ ఎం.కార్తీక్ తెలిపారు. సంప్రదాయంగా మార్ట్‌గేజ్ రుణ విభాగం బలమైన పనితీరు చూపిస్తోందంటూ.. నష్టాలు (రుణ ఎగవేతలు) తక్కువగా ఉండడంతోపాటు రాబడులు మెరుగ్గా ఉంటున్నట్టు వివరించింది. మొత్తం మార్ట్‌గేజ్ రుణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు) మూడింట రెండొంతుల వాటా కలిగి ఉండడం గమనార్హం. ఇక మొత్తం మార్ట్‌గేజ్ రుణాల్లో అఫర్డ్‌బుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఏహెచ్‌ఎఫ్‌సీ) వాటా 11 శాతంగా ఉంది.
చిన్న రుణాల్లో ఏహెచ్‌ఎఫ్‌సీలకు అధిక వాటా
స్వయం ఉపాధిలోని రుణ గ్రహీతలు తీసుకునే గృహ రుణాల్లో హెచ్‌ఎఫ్‌సీలతో పోల్చి చూస్తే ఏహెచ్‌ఎఫ్‌సీలు అధిక వాటా కలిగి ఉన్నట్టు ఇక్రా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా తక్కువ మొత్తం రుణాల్లో ఏహెచ్‌ఎఫ్‌సీలకు అధిక వాటా ఉందని.. ఇటీవలి కాలంలో వీటి ఏయూఎం వేగంగా పెరిగినట్టు తెలిపింది. వ్యాపార నమూనా రీత్యా బకాయిలు పెరిగిపోతే వాటి వసూలుకు వీలుగా ఏహెచ్‌ఎఫ్‌సీలకు విస్తృతమైన శాఖల నెట్‌వర్క్‌తోపాటు సిబ్బంది అవసరమని పేర్కొంది. స్థిరమైన కార్యకలాపాలకు తోడు మెరుగైన రుణ విధానాలు అనుసరించాలని సూచించింది.
వసూలు కాని మొండి రుణాలు (ఎన్‌పీఏలు) ఏహెచ్‌ఎఫ్‌సీల మొత్తం రుణాల్లో 1.1–1.3 శాతంగానే గత మూడేళ్ల కాలంలో ఉన్నట్టు తెలిపింది. సగటు లోన్ టు వ్యాల్యూ (ఇంటి విలువలో ఇచ్చే రుణం) 55 శాతంగా ఉండడం, రుణాల్లో 40 శాతం సొంత ఇల్లు నిర్మాణం కోసమే ఇస్తుండడంతో రుణ ఆస్తుల నాణ్యత నియంత్రణల్లోనే ఉంటుందని అంచనా వేసింది. రుణ వ్యయాలు తక్కువగా ఉండడంతో ఆస్తులపై రాబడి 3.5–.36 శాతం స్థాయిలో ఉండొచ్చని తెలిపింది. రానున్న రోజుల్లో ఈ రంగంలో బడా సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదురుకానున్న నేపథ్యంలో మార్జిన్ల క్షీణత రిస్క్ ఉంటుందని.. నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించింది.