
దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్. జారీ చేసినప్పటి నుంచి వీటిని ఇంత వరకూ అప్‌డేట్ చేసుకోనివారు వెంటనే చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)అవకాశం కల్పించింది. ఇందుకోసం గతేడాది గడువును విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ 14 వరకు గడువు విధించారు. ఆ తర్వాత రూ .50 రుసుమును చెల్లించి ఆధార్ కేంద్రాల వద్ద అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి గుర్తింపు రుజువు (పీఓఐ), చిరునామా రుజువు (పీఓఏ) అప్‌డేట్ చేసుకోవాలి. రెగ్యులర్ అప్‌డేట్లు ఆధార్ లోని సమాచారం, ప్రస్తుత డాక్యుమెంటేషన్‌కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి.
ఆధార్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పొందేటప్పుడు, బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు లేదా ఇతర అవసరమైన కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసేటప్పుడు సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా ఆధార్ సమాచారాన్ని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవడం వల్ల డెమోగ్రాఫిక్ డేటాబేస్‌లో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అధికారులకు వీలవుతుంది. తద్వారా దుర్వినియోగాలు, మోసాలు నివారించడంతోపాటు ప్రజా సేవల్లో జాప్యాలు, తిరస్కరణలను తగ్గించడానికి ఆస్కారం కలుగుతుంది.
ఆన్‌లైన్‌లో ఏమేమి అప్‌డేట్ చేయవచ్చు?
ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని యూఐడీఏఐ అందిస్తున్నప్పటికీ, ఆధార్‌లోని కొన్ని రకాల వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. యూఐడీఏఐ ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయడానికి అనుమతిస్తోంది. అవి ఏమిటంటే..
🔹పేరు (చిన్న మార్పులు చేసుకోవచ్చు)
🔹పుట్టిన తేదీ (కొన్ని పరిమితులున్నాయి)
🔹చిరునామా
🔹జెండర్
🔹భాష ప్రాధాన్యతలు
బయోమెట్రిక్ సమాచారం మారదు
ఆన్‌లైన్‌లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారం అప్‌డేట్ చేసేందుకు వీలులేదు. ఫోటో, వేలిముద్రలు, ఐరిస్ (కనుపాప) స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే, భౌతికంగా ఆధార్ నమోదు కేంద్రంలో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే బయోమెట్రిక్ వివరాలను ధ్రువీకరించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అవసరమైన పరికరాలు కేంద్రాల వద్ద మాత్రమే ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ ఇలా..
👉అధికారిక పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ను సందర్శించండి.
👉"లాగిన్" బటన్ పై క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
👉రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయడానికి దానిని నమోదు చేయండి.
👉లాగిన్ అయిన తర్వాత పేజీ పై కుడివైపున ఉన్న 'డాక్యుమెంట్ అప్‌డేట్'పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ప్రస్తుత గుర్తింపు రుజువు, చిరునామా రుజువును ధ్రువీకరించి అప్‌డేట్ చేస్తారు.
👉డ్రాప్‌డౌన్ మెనూ నుంచి తగిన డాక్యుమెంట్ రకాలను ఎంచుకుని స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. ఫైళ్లు JPEG, PNG లేదా PDF ఫార్మాట్ లో, 2MB కంటే తక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోండి.
👉వివరాలన్నీ సరిచూసుకుని డాక్యుమెంట్ లను సబ్‌మిట్ చేయండి. తర్వాత మీకొక సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు (SRN) వస్తుంది. దీనితో అప్‌డేట్ స్థితిని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది.