అనుమతి లేకుండానే కొనుగోళ్లు
నిఘా పెంచాలి
ఇల్లెందు: పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మార్కెట్ ఫీజు చెల్లించడంలేదు. దీంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే ప్రైవేట్ మార్కెట్‌లోనే పత్తి, మొక్కజొన్నలకు అధిక ధర పలుకుతోంది. క్వింటాల్ పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.8,867 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు రూ.9,100 చెల్లిస్తున్నారు. మొక్కజొన్న క్వింటాల్ ధర రూ. 2,400 ఉండగా, ప్రైవేట్‌లో రూ. 3 వేలు పలుకుతోంది. ధాన్యం క్వింటాల్ ధర రూ. 2,491 ప్రైవేట్ వ్యాపారులు అంతకంటే ఎక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్తి, ధాన్యం, మక్కలు సీసీఐ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. వ్యాపారులు పొలాలు, చేల వద్దకే వెళ్లి కొనుగోలు చేసి తరలిస్తున్నారు.
గ్రామాల్లో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారుల్లో చాలామంది మార్కెట్ ఫీజుకు ఎగనామం పెడుతున్నారు. ఇక అనుమతి లేకుండానే పలువురు కొనుగోళ్లు జరుపుతున్నారు. వీరంతా లైసెన్స్ హోల్డర్లతో పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. రైతు పేరుతో పత్రాలు సృష్టించి తరలించుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయనికి గండి పడుతోంది. జిల్లాలోని కొత్తగూడెం మార్కెట్ పరిధిలో 37 మంది వ్యాపారులు ఉండగా, దమ్మపేట మార్కెట్ పరిధిలో 8మంది, భద్రాచలం మార్కెట్ పరిధిలో 10,చర్ల మార్కెట్ పరిధిలో ఐదుగురు, బూర్గంపాడులో 11 మంది ఉన్నారు. ఇల్లెందు మార్కెట్ పరిధిలో 68మంది వ్యాపారులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 139 మంది వ్యాపారులకు లైసెన్సులు ఉన్నాయి. వీరు కాకుండా పలు వురు అనధికార వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. జిల్లాలో కొనుగోలు చేసి న పత్తిని ఆదిలాబాద్, భైంసాల మీదుగా మహా రాష్ట్రకు తరలిస్తున్నారు. ఇక ఇల్లెందు మార్కెట్‌కు పాలకవర్గం లేదు. అధికారులు కూడా లేరు. ఉన్నతాధికారులు చొరవ చూపి రెగ్యులర్ అధికారులను నియమిస్తే పంట ఉత్పత్తుల కొనుగోళ్ల ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది ప్రైవేటు వ్యాపారులు జోరుగా పంటలను కొంటున్నారు. ఇల్లెందులో కనీసం వ్యాపారుల నుంచి ప్రభుత్వ ఫీజు వసూలు చేయాల్సిన అధికారులు కూడా లేరు. ప్రభుత్వం అధికారులను నియమించి, నిఘా పెంచాలి.
– ఉపేందర్, బొజ్జాయిగూడెం, ఇల్లెందు


