సింగరేణి, ఐటీడీఏలదీ అదే పరిస్థితి
● 3,300 మంది సభ్యులతో కొనసాగుతున్న సొసైటీ ● మరో పీఏసీఎస్‌ను మంజూరు చేయని అధికారులు ● నిర్లక్ష్యం వీడని ఐటీడీఏ, సింగరేణి సంస్థలు ● దరిచేరి దూరమైన విద్య, ఉపాధి, సాగునీటి వనరులు
ఇల్లెందురూరల్: ఇల్లెందు మండలంపై పాలకులు నిర్లక్ష్యం వీడటంలేదు. ఇటీవల కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటు ప్రకటించిన అధికారులు ఇల్లెందుకు అవకాశం ఇవ్వలేదు. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకా రం మండలంలో 47 వేల ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల అవుతున్నాయి. పట్టాలు లేని రెవెన్యూ, పోడు భూములు మరో పదివేల ఎకరాల వరకు ఉంటాయి. మండలంలో సుమారు 57 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. 3,300 మంది సభ్యులతో ఒకే పీఏసీఎస్ కొనసాగుతోంది. పరిపాలన సౌలభ్యం, సేవలు రైతులకు మరింతగా చేరువ చేసేందుకు మంజూరు చేసిన నూతన పీఏసీఎస్‌ల జాబితాలో ఇల్లెందుకు మొండిచేయి చూపించారు.
అధికంగా కూరగాయలు పండిస్తున్నా..
మండలంలో వంద ఎకరాలకు సాగునీరు ఇవ్వగలిగే స్థాయిలో ఏ చెరువునూ అభివృద్ధి చేయలేదు. మస్సివాగు, ముర్రేడువాగు, చలివాగు మండలం నుంచి ప్రవహిస్తున్నా.. కేవలం ఒకే ఒక్క చెక్‌డ్యాం నిర్మించి చేతులు దులుపుకున్నారు. పంట ఉత్పత్తులు భద్రపర్చుకునేందుకు గిడ్డంగి కూడా లేదు. జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో కూరగాయలు పండించే ఇల్లెందులో రైతులకు సౌకర్యాలు కల్పించడంలేదు.
మంజూరై తరలిపోయిన విద్యాసంస్థలు
తెలంగాణ వచ్చాక ప్రభుత్వం మంజూరు చేసిన గురుకులాల్లో మైనారిటీ గురుకులం మాత్రమే ఇల్లెందులో ఉండగా, బీసీ, ఎస్సీ గురుకులాలు ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల ప్రాంగణంలో డిగ్రీ కళాశాల మంజూరవగా శంకుస్థాపనకు ఏర్పా ట్లు జరుగుతుండగానే అశ్వారావుపేటకు తరలిపోయింది. ఇల్లెందుకు మంజూరు కావాల్సిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ గడపదాటిపోయింది. 12 జీపీలకు కేవలం ఒకే హైస్కూల్ ఉండగా, ప్రభుత్వ కళాశాల ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఉన్న త చదువుకు దూరభారమై కొందరు, పేదరికంతో మరికొందరు పాఠశాల స్థాయిలోనే చదువు మానేస్తున్నారు.
బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లెందుకు వందకు పైగా ఏళ్ల చరిత్ర ఉంది. సంస్థ ఆర్జించిన లాభాల్లో నుంచి పలు చోట్ల ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి సాంకేతిక విద్యాసంస్థలు, ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు సాధారణ విద్యాసంస్థలను నెలకొల్పింది. కానీ ఇల్లెందులో మాత్రం కేవలం పదో తరగతికే పరిమితం చేసింది. బొగ్గు తవ్వకాలు చివరి దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలోనైనా సాంకేతిక విద్యాసంస్థ నెలకొల్పాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఐటీడీఏ యువజన శిక్షణ కేంద్రంతోనే సరిపెట్టింది.


