ఎన్‌జీఆర్‌ఐ సర్వేలో కీలక ఆధారాలు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌జీఆర్‌ఐ సర్వేలో కీలక ఆధారాలు

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

● బౌద్ధ పట్టణం ఆనవాళ్ల గుర్తింపు? ● నేలకొండపల్లిలో పూర్తయిన రెండు రోజుల పరిశీలన

● బౌద్ధ పట్టణం ఆనవాళ్ల గుర్తింపు? ● నేలకొండపల్లిలో పూర్తయిన రెండు రోజుల పరిశీలన

నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం పరిసరాల్లో పురాతన కట్టడాలు, స్తూపం చారిత్రక ఆనవాళ్ల గుర్తింపునకు నేషనల్‌ జియోగ్రఫీ రీసెర్స్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌జీఆర్‌ఐ) ఆధ్వర్యాన చేపట్టిన సర్వే ఆదివారం ముగిసింది. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.నాగరాజు ఆధ్వర్యాన రెండు రోజులుగా బౌద్ధక్షేత్రం, బైరాగి గుట్టతో పాటు ఎంపిక చేసిన ఏడు ప్రాంతాల్లో ఆధునిక పరికరాలతో సర్వే చేశారు. జీపీఆర్‌, నేషనల్‌ జియోగ్రఫీ రీసెర్స్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) బృందం ప్రతినిధి, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సక్రం కూడా పాల్గొనగా, ఇక్కడ బౌద్ధుల పట్టణానికి సంబంధించి భూగర్భంలో భారీ నిర్మాణాలను గుర్తించినట్లు తెలిసింది. క్షేత్రం పరిసరాల్లో కట్టడాలు, చారిత్రక ఆనవాళ్లు, బౌద్ధులు వినియోగించిన వస్తువులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

భూమి లోతుల్లో పరిశీలన

అత్యాధునిక యంత్రాలతో బౌద్ధక్షేత్రం వద్ధ 10 మీటర్లు, బైరాగి గుట్ట ప్రాంతంలో 20 మీటర్ల లోతు వరకు సర్వే నిర్వహించారు. బౌద్ధులు సున్నం రాయి వినియోగించినట్లు ప్రాథమికంగా గుర్తించినా, విగ్రహాల తయారీకి వాడారా లేక ఇక్కడ సున్నం రాయి నిక్షేపాలు ఉండేవా అన్నది తేల్చందుకు మరింత సమయం పడుతుందని సమాచారం. అలాగే, బైరాగి గుట్ట ప్రాంతంలో లభించిన నాలుగు రకాల రాళ్ల ఆధారంగా ఇక్కడ డోలమైట్‌, యూరేనియం ఉండే అవకాశముందని భావిస్తున్నట్లు తెలిసింది. అంతేకాక బౌద్ధక్షేత్రం నుంచి ఇటు ముజ్జుగూడెం, సధాశివాపురం, పాత కొత్తూరు గ్రామాల వైపు దాదాపు మూడు కి.మీ. మేర నగరం ఉండేదని బృందం గుర్తించినట్లు సమాచారం. అయితే, సర్వేలో వెల్లడైన వివరాలతో నివేదిక సిద్ధం చేసి పురావస్తు శాఖకు అప్పగిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి సుమన్‌చక్రవర్తి, పురావస్తు శాఖ ఏడీలు గంగాదేవి, మల్లు, ఎన్‌జీఆర్‌ఐ స్కాలర్లు సంతోష్‌, రమేష్‌, జేఈ శంకర్‌, ఎన్విరాన్‌మెంట్‌ గ్రీన్‌వే సంస్థ చైర్మన్‌ దుడ్డెల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement