పెద్దమ్మతల్లికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్‌ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

భద్రగిరికి

రూ.14.50 లక్షల విరాళం

భద్రాచలం టౌన్‌: నలజర్లకు చెందిన రాయుడు రామకృష్ణ, సత్యప్రియాంక దంపతులు ఉదారత చాటుకున్నారు. ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రూ.14.50 లక్షల విరాళం అందించారు. గోశాల నిర్వహణకు రూ.5 లక్షలు, అన్నదాన కార్యక్రమానికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. రూ.4.50 లక్షల విలువైన వెండిని స్వామి వారికి సమర్పించారు. గోసేవ, అన్నదాన కార్యక్రమాలకు దంపతులు అందించిన సహకారంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

నేడు ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం):కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్నిశాఖల జిల్లా అధికారులు ఉద యం 10 గంటలకు హాజరుకావాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజా వాణి నిర్వహిస్తామని పేర్కొన్నారు.

గిరిజన దర్బార్‌కు హాజరుకావాలి

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రజావాణి కార్యక్రమాలకు అధికారులు ఉదయం 10.30 గంటలకు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌, సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

టీజీ టెట్‌ ప్రశాంతం

జూలూరుపాడు(సుజాతనగర్‌): సుజాతనగర్‌ మండలం వేపలగడ్డ అబ్దుల్‌ కలాం కళాశాలలో ఆదివా రం నిర్వహించిన టీజీ టెట్‌ ప్రశాంతంగా ముగిసింది. మొదటి సెషన్‌లో 90 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 81 మంది పరీక్షకు హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌లో 54 మంది రాయాల్సి ఉండగా, 44 మంది హాజరయ్యారు. 10 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు.

మంచు దుప్పట్లో ఏజెన్సీ

దుమ్ముగూడెం: మండలంలో ఉష్ణోగ్రతలు పడిపోయి ఆదివారం మంచు భారీగా కురిసింది. ఉదయం 9 గంటల వరకు మంచు విపరీతంగా కురియడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దారి కనిపించక ప్రయాణికులు వాహనాల లైట్లు వేసుకుని వెళ్లారు.

ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు త్యాగం చిరస్మరణీయం

చుంచుపల్లి: అటవీ పరిరక్షణ కోసం ఎఫ్‌ఆర్వో చలమల శ్రీనివాసరావు చేసిన త్యాగం చిరస్మరణీయమని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఆదివారం శ్రీని వాసరావు నాలుగో వర్ధంతి సందర్భంగా కొత్తగూడెంలోని సీఎస్‌ఆర్‌ సెంట్రల్‌ పార్కులో ఆయన విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. 2022 నవంబర్‌ 22న అటవీ ప్లాంటేషన్‌ పరిరక్షణ విధుల్లో ఉండగా దాడికి గురై శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.

పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

భద్రాచలంటౌన్‌: పట్టణంలోని ముదిరాజ్‌ బజార్‌లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. 128 ఇళ్లను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలను గుర్తించారు. నంబర్‌ప్లేట్లు లేని 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ అరుణ్‌కుమార్‌, సీఐ రాజు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement