అధికారుల ప్రత్యేక దృష్టి
● ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా రహదారుల విస్తరణ ● 80 అడుగులకు కరకట్ట దిగువ రోడ్డు, వన్ వే ప్రతిపాదన ● ఆలయాల పరిసరాల్లో భూసేకరణపై కసరత్తు ● మౌలిక సదుపాయాల కల్పనపై అధికారుల దృష్టి
భద్రాచలం: గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భద్రాచలం రూపురేఖలను మార్చేందుకు అధికా రులు కసరత్తు చేస్తున్నారు. పుష్కర స్నానా లకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు, భక్తుల రాకపోకలు సులభతరం చేయ డం, ఆలయ పరిసరాలను మరింత విశాలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సుమా రు కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ముందస్తు కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
80 అడుగులకు రహదారి విస్తరణ
పుష్కరాల సమయంలో ప్రధానంగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కరకట్ట దిగువన రహదారి విస్తరణ చేపడుతున్నారు. ఇప్పటికే నిధులు కేటాయించగా, రహదారిని 80 అడుగుల మేర విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అభయాంజనేయ స్వామి పార్కు నుంచి విస్తా కాంప్లెక్స్ మీదుగా కూనవరం రోడ్డుకు ఈ మార్గాన్ని అనుసంధానించి వన్ వేగా వినియోగించే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. గత పుష్కరాల సమయంలో బ్రిడ్జి రోడ్డు, కరకట్ట ప్రాంతం, గోదావరి ఘాట్‌లకు వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భక్తులు ఇబ్బంది పడ్డారు. రోడ్డు విస్తరణతో సమస్య లేకుండా భక్తులు సులభంగా చేరుకోవచ్చు.
● గోదావరి నుంచి రామాలయానికి వచ్చే చప్టా దిగు వ రహదారి విస్తరణకు ఇప్పటికే భూసర్వే పూర్తి చేశారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా గోదావరి ఘాట్ల నుంచి రామాలయానికి భక్తులు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది.
● లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టుపక్కల భూసేకరణ సాధ్యాసాధ్యాలపైనా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆలయానికి పడమర దిశలో గోదావరి కరకట్ట వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆలయం మరింత శోభాయానంగా దర్శనమిచ్చే అవకాశం ఉంది.
● భూసేకరణ సాధ్యమైతే రామాలయం, లక్ష్మీనరసింహాస్వామి ఆలయాల ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరింత స్పష్టంగా కనిపించేలా పరిసరాలను తీర్చిదిద్దవచ్చు. ఆలయాల చుట్టూ విశాలమైన ప్రదేశం అందుబాటులోకి రావడంతో భక్తుల రాకపోకలకు సౌలభ్యంతోపాటు పర్యాటక ఆకర్షణ కూడా పెరిగే అవకాశం ఉంది.
భద్రాచలం రామాలయం వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులు(ఫైల్)
పుష్కరాల ఏర్పాట్లపై భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇతర అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. సబ్ కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్ ప్రాంతాలు, భక్తులను నియంత్రిత పద్ధతిలో ఘాట్లకు తరలించే హాల్టింగ్ పాయింట్లను ఇప్పటికే పరిశీలించారు. పుష్కర ఘాట్ల విస్తరణ, రహదారుల అభివృద్ధిపై పలు సూచనలు చేస్తున్నారు.


