● యూనివర్సిటీకి త్వరలో నిధులు, వీసీ.. ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● ఘనంగా మనోహ్మన్ వర్సిటీ (కేఎస్‌ఎం) స్వర్ణోత్సవాలు
కొత్తగూడెంఅర్బన్: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌గా 1976లో ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పాత కళాశాల ఆవరణలో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. వేడుకలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పూర్వ విద్యార్థులు అనుభవం, పరిచయాలను ఉపయోగించి విశ్వవిద్యాలయానికి ఆర్థిక సహకారంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సేవలు అందించాలని కోరారు. పూర్తిస్థాయి వీసీ, బోధనా సిబ్బంది నియామకాలు, వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని, పూర్వ విద్యార్థులు సూచించిన అర్హులైన నిపుణుల పేర్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. సింగరేణి, కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ వంటి సంస్థల సహకారంతో నిధులు సమీకరిస్తామని తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.250 కోట్ల నిధుల కేటాయింపు ప్రతిపాదనను ప్రస్తావిస్తూ, ఆ నిధులతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూ పొందిస్తున్నట్లు వివరించారు. అనంతరం మంత్రి మైనింగ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ చాప్టర్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు అసోసియేషన్ తరఫున ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, అధికారులు మధు, దారా ప్రసాద్, అనూ ష, విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బిక్కి రమేష్ కుమార్, పూర్వ విద్యార్థులు, మైనింగ్ రంగ నిపుణులు, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


