చిన్న సెక్షన్ నిర్మిస్తే..
● భద్రాచలం–మల్కన్‌గిరి రైల్వే లైన్‌కు ముంపు ముప్పు ● ముంపు ప్రాంతంలో చింతూరులోని ప్రతిపాదిన ప్రాంతం ● లైన్ ఒడిశా టూ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఏపీలోకి మార్చే చాన్స్ ● నిర్మాణ పనుల్లో తప్పని మరింత జాప్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం–మల్కన్‌గిరి రైల్వేలైన్ నిర్మాణంలో ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యా యి. క్షేత్రస్థాయి పరిస్థితులతో సంబంధం లేకుండా అలైన్‌మెంట్ నిర్ణయించడంతో ఈ పరిస్థితి ఎదురైంది. భద్రాచలం– మల్కన్‌గిరి (ఒడిశా) కొత్త లైను నిర్మాణానికి రైల్వేశాఖ 2021లో పచ్చాజెండా ఊపింది. 173 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణానికి 2022 జూన్‌లో ప్రాథమిక సర్వే రిపోర్టు వచ్చింది. ప్రాజెక్ట్‌కు రూ. 3,592 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రైల్వేలైనుకు 2024 ఆగస్టులో కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒడిశాపరిధిలో మల్క న్‌గిరి, బదాలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లిస్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో కన్నాపురం, కుయుగూరు, పల్లు, నందిగామ స్టేషన్లు, తెలంగా ణ పరిధిలో భద్రాచలం, పాండురంగాపురం స్టేష న్లు నిర్మించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రెండేళ్ల తర్వాత
రైల్వేలైన్ నిర్మాణానికి ఒడిశా పరిధిలో భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. లైన్ నిర్మాణంలో భాగంగా చింతూరు మండలం కన్నాపురం, కుయుగూరు గ్రామాల మధ్య శబరిపై వంతెన నిర్మించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా భూసేకరణ కోసం రెవెన్యూ రికార్డులు పరిశీలించగా, ఈ ప్రాంతమంతా పోలవరం ముంపు సేకరణ కింద ఉన్నట్టు తేలింది. పోలవరం ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఈ రెండు గ్రామాలు ముంపునకు గురవుతాయని 2009లోనే గుర్తించారు. ఇప్పటికే ఇక్కడ రైతులకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆలస్యం కారణంగా ఇంకా ఆ గ్రామాలు మనుగడలో ఉన్నాయి. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వస్తే గ్రామాలను ఖాళీ చేయాల్సిందే. కానీ రైల్వేశాఖ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం టెక్నికల్ సర్వే ఆధారంగా కుయుగూరు – కన్నాపురం గ్రామాల మీదుగా లైను ప్రతి పాదించింది. దీంతో రైల్వేలైను నిర్మాణం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది.
ఒడిశా టూ ఛత్తీస్‌గఢ్
ముందుగా నిర్ణయించిన అలైన్‌మెంట్ ప్రకారం మల్కన్‌గిరిలో మొదలైన రైల్వేలైనుకు ఒడిశాలో చివరి స్టేషన్‌గా మహారాజ్‌పల్లి ఉంది. ఆ తర్వాత ఏపీలోని చింతూరు మండలంలోకి వస్తుంది. అక్క డ కుయుగూరు – కన్నాయిగూడెంల మధ్య శబరి దాటి కూనవరం మండలం పల్లు, నందిగామ మీదుగా భద్రాచలం చేరుకుంటుంది. సుమారు 65 కి.మీ నిడివి కలిగిన ఈ ప్రాంతంలో మెజార్టీ ముంపు కింద ఉంది. దీంతో ఒడిశా నుంచి ఏపీలోకి నేరుగా రాకుండా ఒడిశాలోని మోటు సమీపంలోనే శబరి నది దాటుకుని ఛత్తీస్‌గఢ్‌లోని కుంట డివిజన్‌లోకి అలైన్‌మెంట్ మారే అవకాశం ఉంది. అక్కడి నుంచి ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న కిరండోల్ – కొత్తగూడెం రైలు మార్గంలో ప్రతిపాదించిన రామచంద్రునిపేట నుంచి గంగ్రేల్ స్టేషన్ల మధ్య ఈ లైను కలిపే అవకాశాన్ని రైల్వేశాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
పాండురంగాపురం–మల్కన్‌గిరి రైలు మార్గానికి నిడివి 174 కి.మీలుగా ఉంది. లైను నిర్మాణానికి రూ.3592 కోట్ల వ్యయం అవుతుందని కేంద్రం పేర్కొంది. కానీ ప్రస్తుతం అలైన్‌మెంట్ మారే అవకాశం ఉండటంతో నిర్మాణ పనుల్లో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. దీంతో ఓ వైపు అలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తూనే మరోవైపు ప్రతిపాదిత పాండురంగాపురం – సారపాక వరకు ఉన్న 13 కి.మీ సెక్షన్ మేరకు త్వరగా కొత్త లైను నిర్మించాలని తెలంగాణ వాసులు కోరుతున్నారు. దీనివల్ల తక్కువ బడ్జెట్‌తోనే భద్రాచలానికి రైలు మార్గం అందుబాటులోకి తేవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


