● గోదావరి తీరంలో భక్తుల పుణ్యస్నానాలు ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దీపారాధనలు
భద్రాచలంటౌన్/పాల్వంచరూరల్: ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లావ్యాప్తంగా శివాలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. దీపారాధన చేశారు. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు తరలివెళ్లారు. భద్రాచలం వద్ద గోదావరి తీరం కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాలతోపాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, నదీ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి గోదావరిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. నదీ తీరంలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు.


