దమ్మపేట: మండల పరిధిలోని ముష్టిబండ శివారులో శ్రీదుర్గామల్లేశ్వరాలయంలో స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం దర్శించుకున్నారు. అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రావు గంగాధరరావు, తదితరులు పాల్గొన్నారు.
పుస్తక పఠనం చేయాలి
కొత్తగూడెంఅర్బన్: శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మెదడుకు పుస్తక పఠనం అంత అవసరమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పుస్తక పఠన అవగాహన సదస్సులో మాట్లాడారు. పుస్తక పఠనం ద్వారా మాత్రమే మేథాశక్తి పెరుగుతుందని అన్నారు. కె.కరుణకుమారి, బాబు, రవి, ఎస్.లలిత కుమారి జి.మణిమృదుల పాల్గొన్నారు.
విత్తన నాణ్యతతోనే
అధిక దిగుబడి
బూర్గంపాడు: విత్తన నాణ్యతతోనే అధిక దిగుబడులు వస్తాయని శాస్త్రవేత్తలు, నాబార్డు అధి కారులు అన్నారు. రైతులకు నాణ్యమైన వరి విత్తనాలను అందించడంతోపాటు విత్తనోత్పత్తి పై అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం మండలంలో క్షేత్ర ప్రదర్శన, రైతులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. పీజేటీఏయూ–నాబార్డ్–పీఏసీఎస్ ప్రాజెక్టులో భాగంగా బీపీటీ– 5204 వరి విత్తనోత్పత్తిపై ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్, నాబార్డు ఖమ్మం జిల్లా అభివృద్ధి మేనేజర్ సుజిత్‌కుమార్ మా ట్లాడుతూ విత్తన నాణ్యతతోనే అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. అధికారులు,ప్రజాప్రతి నిధులు తాతారావు, రాజు, వసుమతి, మణిశంకర్, నాగరాజు, ప్రసాద్,అనిత పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కేసులు బదలాయింపు
కొత్తగూడెంఅర్బన్: ఖమ్మం కోర్టులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను కొత్తగూడేనికి బదలాయిస్తూ ప్రభుత్వం నుంచి సోమవారం ఉత్తర్వులు వెలువడ్డా యి. జిల్లాలోని కేసుల విచారణను కొత్తగూడెం 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టుకు కేటాయించా రు. దీంతో కక్షిదారులు ఖమ్మం వెళ్లే అవసరం ఉండదు. ఈ నిర్ణయం పట్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ ముదల్కర్, ప్రధాన కార్యదర్శి మహేష్ గడిపెల్లి హర్షం వ్యక్తం చేశారు.
ఇంటెలిజెన్స్ ఆరా
భద్రాచలంటౌన్: భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ల జారీలో సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. తహసీల్‌లో ముడుపుల వ్యవహారంపై ‘పైసలిస్తేనే పత్రాలు’ శీర్షికన సోమవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీంతో అధికారులు స్పందించి కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై వివరాలు సేకరి స్తున్నట్లు సమాచారం. మరోవైపు తహసీల్దార్ సైతం సిబ్బందితో సమావేశమై విచారణ చేపట్టినట్లు తెలిసింది.
అల్లివేర్ల అక్రమార్కులకు జరిమానా
దుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు గ్రామంలోని ఓ కాంప్లెక్స్ షెట్టర్లలో అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న అల్లివేర్లకు రూ.1,94,600 జరిమానా విధించి సరుకును భద్రాచలం రేంజ్ కార్యాలయానికి తరలించనున్నట్టు రేంజర్ కమల తెలిపారు. రెండు రోజుల క్రితం ములకపాడు గ్రామంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన అల్లివేర్ల స్థావరంపై అటవీశాఖ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం కాటా వేయగా 5,336 కేజీల కొమ్మలు, 1,108 కేజీల వేర్లు ఉన్నట్టు తేలింది. అటవీశాఖ నిబంధనల ప్రకారం రూ. 1,94,600 జరిమానా విధించి, నిందితులు రామకృష్ణ అలియాస్ బాబీ, డింగి నాగేశ్వరరెడ్డిలపై కేసు నమోదు చేసినట్టు రేంజర్ తెలిపారు.


