సూపర్‌బజార్(కొత్తగూడెం): రబీలో తక్కువ నీటి అవసరం ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు రాయితీ విత్తనాల పంపిణీ, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే రబీ సీజన్ ప్రణాళిక, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, భూసేకరణ పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అధికారులు సిద్ధార్థ విక్రమ్ సింగ్, డి.వేణుగోపాల్, సునీత, బాబూరావు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


