తాజాగా జపాన్ పర్యటనకు
కలెక్టర్ అంకిత్
అవకాశం రావటం సంతోషం
● ఆస్పిరేషనల్ బ్లాక్‌లో అభివృద్ధి కార్యక్రమాలతో గుర్తింపు ● గతంలోనూ జిల్లాకు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు ● రేపు జపాన్ అధ్యయన పర్యటనకు వెళ్లనున్న కలెక్టర్ అంకిత్
చుంచుపల్లి: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, అధికారుల సమష్టి కృషి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్నాయి. ఈ క్రమంలోనే కలెక్టర్ అంకిత్‌కు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 21 వరకు జపాన్ అధ్యయన పర్యటనకు అవకాశం లభించింది. నీతి ఆయోగ్ చేపట్టిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, బ్లాక్స్ కార్యక్రమం ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి అంతరాలను తగ్గించడంపై, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం–జలవనరులు, ఆర్థిక సమ్మిళితం–నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశారు.
గతేడాది గవర్నర్ నుంచి అవార్డు
2023లో ప్రారంభమైన ఆస్పిరేషనల్ బ్లాక్స్ కార్యక్రమంలో జిల్లాలోని గుండాల మండలం ఎంపికై ంది. ఈ క్రమంలో 2024 జూలై 5న సంపూర్ణత అభియాన్ ప్రారంభించారు. అప్పటి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో ఇంటింటి సర్వేలు, ఆరోగ్య పరీక్షలు, గర్భిణుల నమోదు, చిన్నారుల బరువు పరిశీలన, పోషకాహార లోపం గుర్తింపు, తాగునీరు, పారి శుద్ధ్యం, రైతులకు నేల, ఆరోగ్య కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారు. వందశాతం లక్ష్యం నెరవేరడంతో 2025 ఆగస్టు 2న హైదరాబాద్ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి అప్పటి కలెక్టర్ పురస్కారాన్ని అందుకున్నారు. గోదావరి వరదల సమయంలో భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)ను వినియోగించి ముంపు ముప్పు ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించడంతోపాటు వ్యవసాయ రంగంలోనూ వైవిధ్య పంటల సాగుకు కృషి చేశారు. దీంతో 2025 జూలైలో ముంబైలో నిర్వహించిన ఓపెన్ సోర్స్ జీఐఎస్ దినోత్సవంలో జిల్లాకు నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్, ఓపెన్ సోర్స్ జీఐఎస్ కోహార్ట్ అవార్డులు లభించాయి.
ఇంకుడు గుంతలు.. జాతీయ పురస్కారం
జల సంరక్షణలోనూ జిల్లా విశేష ప్రగతి సాధించింది. కేంద్ర జలశక్తి శాఖ చేపట్టిన జల్ సంచయ్–జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా 2025 మే నెలలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఏకకాలంలో 29,103 ఇంకుడు గుంతలు నిర్మించారు. ఉపాధి హామీ పథకం కింద 1,100 నీటి నిల్వ గుంతల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఈ కృషికి గుర్తింపుగా 2025 నవంబర్ 18న న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేసిన ఆరో జాతీయ జల పురస్కారాల్లో భద్రాద్రి జిల్లా సౌత్ జోన్ –3 విభాగంలో మొదటి స్థానాన్ని సాధించింది. అప్పటి కలెక్టర్ జితేష్ పాటిల్ అవార్డును అందుకోగా, జిల్లాకు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం కూడా లభించింది.
గతంలో సాధించిన విజయాలకు కొనసాగింపుగా ప్రస్తుత కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నీతి ఆయోగ్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) సంయుక్తంగా నిర్వహిస్తున్న అధ్యయన కార్యక్రమానికి కలెక్టర్ అంకిత్ ఎంపికయ్యారు. ఈ నెల 15 నుంచి 21 వరకు ఆయన జపాన్‌లో పర్యటించనున్నారు. జపాన్‌లోని స్థానిక పరిపాలన, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి వనరుల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయనున్నారు.
నీతి ఆయోగ్ ద్వారా జపాన్ పర్యటనకు అవకాశం రావడం సంతోషకరం. అధ్యయన పర్యటన ద్వారా అక్కడి ఉత్తమ అభివృద్ధి విధానాలను తెలుసుకుని, జిల్లా అవసరాలకు అనుగుణంగా అమలు చేసేందుకు కృషి చేస్తాం.
–అంకిత్, కలెక్టర్


