బూర్గంపాడు: మండలంలోని సారపాకలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బసప్ప క్యాంపునకు చెందిన నిఖిల్ (20) ఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భద్రాచలం నుంచి సారపాకకు ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా గోదావరి వంతెన దాటిన అనంతరం వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో గేదెలు మృతి
టేకులపల్లిరూరల్: ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భీల్యాతండాకు చెందిన ధరావత్ కుమారి పెంచుతున్న గేదెలు శుక్రవారం మేతకు వెళ్లి తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ. 80వేలు ఉంటుందని అంచనా.
ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు
భద్రాచలంటౌన్: భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో స్టేషన్ మాస్టర్ వెంకన్నపై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బస్టాండ్‌లో బస్సులు నిలిపే పాయింట్ వద్ద ఆటోను నిలపడంతో తొలగించాలని స్టేషన్ మాస్టర్ సూచించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
సూపర్‌బజార్(కొత్తగూడెం): లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీకాలనీలో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కాలనీకి చెందిన బి.వెంకటేశ్వర్లు చికిత్స కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. రాత్రి సమయంలో ఇంట్లో నుంచి మంటలు రావడం చుట్టుపక్కల వాళ్లు గమనించి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.4.50 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా.


