న్యూస్‌రీల్
కొత్తమార్గంలో..
దండకారణ్యం నుంచి అక్రమంగా కలప తరలింపు
చిట్కా వైద్యం పేరుతో ఇష్టారీతిన అల్లి చెట్ల నరికివేత
చెక్ పెట్టని అటవీశాఖ అధికారులు
మొక్కజొన్నకు మొలకలు
ఖరీఫ్ సీజన్లో పండించిన మొక్కజొన్నలు రోడ్లపై ఆరబెట్టగా తుపాన్‌కు తడిసి మొలకెత్తాయి.
శనివారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యంలో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయాక కలప స్మగ్లర్లు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఆయుర్వేద మొక్కల సేకరణ పేరుతో అడవిపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు.
అన్నలు లేక..
జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాలకు సరిహద్దులుగా ఉన్నాయి. బస్తర్ ప్రాంతానికి చెందిన ఆ రెండు జిల్లాలు గతేడాది చివరి వరకు మావోయిస్టు కంచుకోటలుగా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఫారెస్టు శాఖ ఉనికి నామమాత్రంగా ఉండేది. కలప స్మగ్లర్లు సైతం అక్రమాలకు వెనుకాడేవారు. కేంద్ర ప్రభుత్వ మావోయిస్టుల నిర్మూలన కార్యక్రమాలతో గత మార్చి 31 నాటికి సుక్మా, బీజాపూర్ జిల్లాలో కూడా మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే అటవీశాఖ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అంతకంటే ముందే స్మగ్లర్లు పాగా వేశారు. కలప, అటవీ ఉత్పత్తుల దందాలోకి దూసుకుపోతున్నారు.
ఐరన్ ఉడ్ చెట్లకు చేటు
బీజాపూర్, సుక్మా జిల్లాలతోపాటు చర్ల, దుమ్ముగూడెం మండలాల పరిధిలో విస్తరించిన అడవుల్లో అల్లి చెట్టు లేదా ఐరన్ ఉడ్ (మెమైసెలాన్ అమ్బెల్లాటం) చెట్లు విరివిగా ఉంటాయి. వీటి చెట్ల ఆకులు, బెరడు, వేర్లు ఇలా ప్రతీ భాగాన్ని ఆయుర్వేద/ మూలిక/ సంప్రదాయ వైద్యంలో వినియోగిస్తారు. గతంలో ఈ తరహా వైద్య విధానాలకు పెద్దగా ప్రాచుర్యం లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి చిట్కా వైద్యం పట్ల ఆసక్తి చూపించే వారు పెరిగారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఐరన్ ఉడ్ చెట్లకు ముప్పు తెస్తున్నారు.
చర్ల, దుమ్ముగూడెం
మండలాలకు పాకిన వైనం
అల్లి చెట్టు కాండం నుంచి వచ్చే కలప దృఢంగా ఉండటంతోపాటు వంపులు తిరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. పడవల తయారీకి అధికంగా ఈ కలపనే వినియోగిస్తారు. డిమాండ్ ఉండటంతో అక్రమార్కులు అల్లి చెట్లను క్రమపద్ధతిలో నరికేస్తున్నారు. ఇందుకోసం మూలికా వైద్యం ముసుగు ధరిస్తున్నారు. ఆరంభంలో వైద్య మూలికలు సేకరిస్తున్నారనే నెపంతో సుక్మా, బీజాపూర్ జిల్లాల పరిధిలో ఐరన్ ఉడ్ చెట్ల బెరడ్లను సేకరించారు. ఆ తర్వాత షుగర్ వ్యాధికి అల్లి చెట్టు వేర్లు బాగా పని చేస్తాయనే ప్రచారం జరగడంతో క్రమంగా చెట్ల వేర్లను నరికేయడం మొదలైంది. చెట్టు చనిపోయే విధంగా వేర్లను ఎక్కడిక్కడ తెంచేస్తున్నారు. ఆ తర్వాత కలపను అమ్మేస్తున్నారు. దందా సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో మొదలైప్పటికీ ప్రస్తుతం దుమ్ముగూడెం, చర్ల మండలాల వరకు పాకింది. చెట్ల వేర్లు, ఆకులు, మూలికలు అని చెబుతూ స్థానిక గిరిజనులకు నామ్‌కే వాస్తేగా కూలీ ముట్ట చెప్పి అడవులను హరించివేస్తున్నారు. చిట్కా వైద్యం పేరుతో అడవుల్లో జరుగుతున్న విధ్వంసంపై అటవీశాఖ దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
బీజాపూర్, సుక్మా జిల్లాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్తోపాటు బస్తర్ ప్రాంత రాజధానిగా చెప్పుకునే జగ్దల్పూర్కు కూడా దూరంగా ఉంటాయి. అక్కడికి వెళ్లేందుకు పరిమిత రవాణా సౌకర్యాలు ఉండటంతో జిల్లా సరిహద్దు ప్రజలకు చర్ల, దుమ్ముగూడెం మండలాలతోనే వ్యాపార లావాదేవీలు ఎక్కువ. అడవుల్లో లభించే అటవీ ఉత్పత్తులతోపాటు కలప అక్రమ రవాణాలో సైతం దుమ్ముగూడెం, చర్లకు చెందిన కొన్ని ముఠాలు ఆధిపత్యం చెలాయించేవి. టేకు, పెద్ద ఏగిస కలప, ఇప్ప పూలు, తేనె వంటి అటవీ ఉత్పత్తుల్లో వీటి హవా నడిచేది. అయితే, ఇప్పుడు టేకు, పెద్ద ఏగిస కలప అక్రమ రవాణా కష్టంతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొత్త మార్గంలో దందాకు తెర లేపారు.


