అనుభవంలేని సంస్థకు టెండర్?
నగరంలో రూ.600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రణాళికలు
టెండర్ దక్కించుకున్న మంగళం కన్సల్టెన్సీ
నిధులు మంజూరైన తర్వాతే సదరు సంస్థకు కమీషన్ చెల్లింపు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశాక రూ.32 కోట్లు నగరాభివృద్ధి నిధుల నుంచి కేటాయించారు. ఆ నిధులతో చేపట్టే పనుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు చేయగా, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, విదేశీ బ్యాంకు రుణం మొత్తం రూ.600 కోట్లతో కార్పొరేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం కార్పొరేషన్ అధికారులు భారీ స్థాయిలో కమీషన్లు మిగిలించుకునేందుకు రహస్యంగా డీపీఆర్ టెండర్ అప్పగించారు. అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయించారు. పంపకాల పర్సంటేజీలో తేడాలతో అధికారుల మధ్య ఒప్పందాలు బహిర్గతమయ్యాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో డీపీఆర్ టెండర్‌ను రద్దు చేశారు.
వారం రోజుల్లో సర్వే
వారం రోజుల్లో డీపీఆర్ సర్వే ప్రారంభమవుతుందని మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. రూ. 600 కోట్లు విడుదల చేశాకనే డీపీఆర్ తయారు చేసే కన్సల్టెన్సీకి కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు వివరణ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కన్సల్టెన్సీకి ఇచ్చే కమీషన్ ఎంతనే విషయం కూడా వెల్లడించడంలేదు. డీపీఆర్ సిద్ధమయ్యాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంతో విదేశీ బ్యాంకు ముందు అభివృద్ధి ప్రతిపాదనలు పెట్టాలి. బ్యాంక్ అంగీకరించి నిధులు మంజూరు చేస్తే అభివృద్ధి పనులు పట్టాలు ఎక్కే అవకాశం ఉంటుంది. ఇందంతా జరిగేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద ఐదు ప్రాజెక్టులకు నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భవిష్యత్‌లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి కోసం కూడా రూ.600 కోట్ల నిధులకు కేంద్ర ప్రభుత్వ వాటా కింద నిధుల మంజూరుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే అధికారులు ఎంత త్వరగా డీపీఆర్‌ను సిద్ధం చేస్తే నిధులు కూడా అంత త్వరగా మంజూరై అభివృద్ధి పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది.
మళ్లీ డీపీఆర్ సిద్ధం చేసేందుకు గత నెలలో మళ్లీ ఆన్‌లైన్‌లో టెండర్ పిలిచారు. మూడు కన్సల్టెన్సీలు టెండర్లు దాఖలు చేయగా, ఒకరి టెండర్ దరఖాస్తు సక్రమంగా లేదని అధికారులు రద్దు చేశారు. మిగిలిన ఇద్దరిలో ఎక్కువకు కోడ్ చేసిన ఖమ్మానికి చెందిన మంగళం కన్సల్టెన్సీ టెండర్ దక్కించుకుంది. గతంలో అభివృద్ధి పనులు చేపట్టినవారికే అధికారులు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం టెండర్ దక్కించుకున్న సంస్థకు అనుభవం లేదని విమర్శలు వస్తున్నాయి.


